Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో పంచాయతీకి సర్పంచ్ అంతేనని వ్యాఖ్య
గుంటూరు : పంచాయతీ అధికారాలను విఆర్ ఒలకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ2 అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపి (సస్పెండ్)వేసింది. ఈ జిఓను సవాల్ చేస్తూ గుం టూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం నిర్వహించిన విచారణలో న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. గ్రామ పంచాయతీల హక్కులను హరించేలా ఈ జిఓ ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని 73వ ఆర్టికల్ సవరణకు, ఎపి పంచాయతీ రాజ్ చట్టానికి ఈ జిఓ వ్యతిరేకంగా ఉందని కోర్టు దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో పంచాయతీలకు సర్పంచ్ అలాగేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారి అధికారాలను విఆర్ఒలకు ఎలా బదలాయిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. గ్రామ స్వపరిపాలనకు జిఒ 2 విరుద్ధమని, రాజ్యాంగంలోని అధికరణ 40, 243కు సైతం పూర్తి భిన్నంగా ఉందని పేర్కొంది. సర్పంచ్ల అధికారాలను హరించకూడదని, గ్రామ పరిపాలనలో ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం తగదని పేర్కొంది. నిధులు విడుదల చేసి విధులకు స్వేచ్ఛ నిచినపుడే గ్రామ స్వరాజ్యం వర్ధిల్లుతుందని వ్యాఖ్యానించింది. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారానే ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్లకూడదని ప్రశ్నించిన ధర్మాసనం ఏపీ పంచాయతీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జిఓ ఉందంటూ పిటిషనర్ చేసిన వాదనలను సమర్ధించింది.