Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో/జైపూర్ : రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు సుమారు 70 మందికి పైగా మరణించారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని 12వ శతాబ్దం నాటి కోట ఎదుట పర్యాటకులు సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగు పడటంతో 11 మంది చనిపోయారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుకు 41 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో ఏడుగురు మరణించారు. ఈ ఘటనల పట్ల ప్రధాని మోడీ దిగ్బ్రాంతిని వ్యక్తంచేశారు. పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి నష్ట పరిహారం చెల్లించనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం..బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు, రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించాయి. అందిన సమాచారం ప్రకారం పిడుగుపాటుకు యూపీలోని 16 జిల్లాల్లో 41 మంది చనిపోగా...ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 14మంది బలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 30 మంది గాయపడ్డారని రిలీఫ్ కమిషనర్ రణవీర్ ప్రసాద్ వెల్లడించారు. సుమారు 250 జంతువులు మృత్యువాత పడ్డాయనీ, మరో 20 గాయపడ్డాయని చెప్పారు.