Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాల విషయంలో దేశవ్యాప్తంగా రైతన్నలు ఇప్పటికే తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రం తీసుకొచ్చిన అగ్రిస్టాక్ వారిలో ఆందోళనలను కలుగచేస్తున్నది. ఈ అగ్రిస్టాక్‌ను వెనక్కి తీసుకోవాల్సిందిగా రైతు సంఘాలు మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
టెక్నాలజీ బేస్డ్ ద్వారా వ్యవసాయాన్ని డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్య పేరే అగ్రిస్టాక్. అయితే, ఈ అగ్రిస్టాక్ అనేది మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల మాదిరిగానే నయా ఉదార మార్గాన్ని నడుపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ అగ్రిస్టాక్ విషయంలో 91 రైతు సంఘాలు, సంస్థలు గత నెల 30న కేంద్ర ప్రభుత్వానికి ఒక నోట్‌ను పంపాయి. అగ్రిస్టాక్ విషయంలో కేంద్రం రైతులను సంప్రదించ కుండానే అమలును ప్రారంభించిందని డిజిటల్ హక్కులపై పనిచేసే సంస్థలు ఆరోపించాయి. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గాలని పేర్కొన్నాయి. దేశంలో వ్యవసాయాన్ని డిజిటలైజ్ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలలో రైతులు, డిజిటల్ హక్కుల సంస్థలు కనుగొన్న సమస్యలను కూడా ఈ నోట్ పేర్కొన్నది. 'ది ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐడీఈఏ)' అనే కన్సల్టేషన్ పేపర్‌కు ప్రతిస్పందనగా ఈ నోట్‌ను సదరు సంస్థలు పంపాయి. ఈ కన్సల్టేషన్ పేపర్‌ను గతనెల 1న వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నిటి ఆయోగ్ అభిప్రాయాల ఆధారంగా వ్యవసాయంలో భారీ డేటా, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ లను మోహరించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నట్టు ఆ పేపర్ పేర్కొన్నది.
ఏదేమైనా, 2020లో సంప్రదింపులు లేకుండా కేంద్రం ఆమోదించిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల మాదిరిగానే కేంద్రం అగ్రిస్టాక్ నిర్ణయం నయా ఉదార మార్గంలో నడుస్తుందని రైతు సంఘాలు ఆరోపించాయి.
రైతుల అభ్యంతరాలు
అగ్రిస్టాక్ కోసం బ్లూప్రింట్ ఇప్పటికే అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్నదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. దీంతో రైతులు.. అల్గారిథం ఆధారంగా నిర్ణయాలలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండదనీ, రైతుల హక్కులు ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఐడీఈఏ పట్ల వారి ప్రధాన అభ్యంతరాలలో ఒకటి ప్రస్తుతం ఉన్న టాస్క్‌ఫోర్స్, గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌లో రైతు ప్రాతినిథ్యం లేకపోవడం. '' అభివృద్ధి చేయబడిన ఏదైనా డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలి. వాటిని ప్రయివేటు చేతుల్లో ఉంచకూడదు'' అని ఐడీఈఏకు వ్యతిరేకంగా సంతకం చేసినవారిలో ఒకరైన ఆశా కిసాన్స్వరాజ్ కన్వీనర్ కవితా కురుగంటి అన్నారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం తన ఏకపక్ష, నియంతృత్వ నిర్ణయాలతో అన్నదాతలను ఇబ్బందుల్లోకి నెడుతోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.