Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యకరమైన ఆయుర్దాయం మాత్రం ఆందోళనకరం
- వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ నివేదిక
న్యూఢిల్లీ : భారత్లో మహిళలు.. పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అయితే, వారు ఆరోగ్యకరమైన జీవితాలను మాత్రం కలిగి లేరు. 'వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ 2021' నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. గతనెలలో విడుదల చేసిన ఈ నివేదిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
పెరిగిన ఆయుర్దాయం
ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయుర్దాయం పెరిగింది. సగటు జీవితకాలం 73.3 సంవత్సరాలుగా ఉన్నది. 2019లో ఆరోగ్యకరమైన జీవితకాలం 63.7 ఏండ్లుగా నమోదైన విషయం విదితమే. కాగా, భారత్లో ఆయుర్దాయం 70.8 సంవత్సరాలుగా ఉన్నది. ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 60.3 ఏండ్లుగా నమోదైంది. పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం 2.7 ఏండ్లు అధికంగా ఉన్నది.
కానీ, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం మాత్రం మహిళల్లో ఆశించినంతగా లేదు. '' పురుషులు, మహిళల మధ్య ఆరోగ్యకరమైన ఆయుర్దాయం తేడా తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. భారతీయ మహిళల ఆయుర్దాయం పురుషులతో పోలిస్తే 2.7 ఏండ్లు ఎక్కువగా ఉన్నది. అయితే, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం విషయంలో మహిళలు, పురుషుల మధ్య తేడా 0.1 ఏండ్లుగా నమోదైంది. భారత్లోని మహిళలు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడం లేదనడాన్ని ఇది చూపిస్తున్నది'' అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఎన్జీఓకు చెందిన ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ పూనమ్ ముట్రేజా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా మగవారి సగటు ఆయుర్దాయం ఆడవారి కంటే ''స్థిరంగా ఐదేండ్లు'' తక్కువగా ఉండగా, మగవారికి ఆరోగ్యకరమైన ఆయుర్దాయం ఆడవారి కంటే 2.4 సంవత్సరాలు తక్కువగా నమోదైంది.
ఆ దేశాల్లో ఇలా...
ఇక పాకిస్థాన్లో మొత్తం ఆయుర్దాయం 65.6 సంవత్సరాలు, ఆరోగ్య ఆయుర్దాయం 56.9 గా ఉన్నది. ఇక్కడ మహిళల ఆయుర్దాయం 2.1 ఏండ్లు అధికంగా ఉండగా, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం పురుషులలో 0.1 సంవత్సరాలు అధికంగా ఉన్నది. ఇక బంగ్లాదేశ్లో ఆయుర్దాయం 74.3 ఏండ్లుగా, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 64 ఏండ్లుగా ఉన్నది. పురుషుల ఆయుర్దాయం మహిళల కంటే 2.6 సంవత్సరాలు తక్కువగా ఉన్నది.
ఇక ఆరోగ్యకరమైన ఆయుర్దాయం వ్యత్యాసం మాత్రం 0.2 ఏండ్లుగా ఉండటం గమనార్హం. యూఎస్ఏలో పురుషులతో పోలిస్తే మహిళలు 4.4 ఏండ్లు ఎక్కువ కాలం జీవిస్తుండగా, ఆరోగ్య ఆయుర్దాయం 1.8 సంవత్సరాలు మాత్రమే అధికంగా ఉండటం గమనార్హం.
మగవారు, ఆడవారి మధ్య ఆరోగ్యకరమైన ఆయుర్దాయం తేడా తక్కువగా ఉన్న దేశాలలో భారత్తో పాటు బొలివియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి దేశాలున్నాయి. స్విట్జర్లాండ్, నార్వే, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలలో ఆయుర్దాయం అధికంగా ఉన్నది. అయితే, ఆయుర్దాయంతో పోల్చుకుంటే మాత్రం ఆరోగ్యకరమైన జీవనకాలం తేడా తక్కువగా ఉండటం గమనార్హం.
'ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడమే..!'
ఆయుర్దాయంలో ముందున్న మహిళలు.. ఆరోగ్యకరమైన జీవితం విషయంలో వెనకబడి పోవడానికి గల కారణం ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడమేనని నిపుణులు తెలిపారు. '' మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. కానీ రక్తపోటు వంటి దీర్ఘకాలి వ్యాధుల ఆగమనం 45-55 ఏండ్లలో జరుగుతుంది. చాలా మంది మహిళలు 60 ఏండ్ల తర్వాత వితంతువులు అవుతారు. ఎందుకంటే, పురుషులు మహిళల కంటే ముందుగానే చనిపోతున్నారు. ఒంటరిగా నివసించే వృద్ధ మహిళల నిష్పత్తి కూడా ఎక్కువ'' అని ముంబయికి చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ (ఐఐపీఎస్)కి చెందిన పీ. అరోకియాసామి అన్నారు.