Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ అడుగులు
తిరువనంతపురం: 'వివక్ష వ్యతిరేక చట్టం' తీసుకువచ్చే దిశగా సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రంలో పౌరహక్కులకు సంబంధించి ముఖ్య మైన విస్తరణ చర్యకావడంతో పాటు మిగిలిన భారత రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలవనుంది. వివక్ష అనేది అనేక కారణాల వల్ల జరుగుతుంది కాబట్టి వారికి ప్రత్యక్ష, పరోక్ష లేదా ఖండనాత్మక చట్టపరమైన పరిష్కారాలు అవసరం. దీని కోసం సమగ్ర వివక్ష వ్యతిరేక చట్టం అవసరం. అటువంటి ప్రత్యేక వ్యవస్థ లేని కొన్ని ఉదార ప్రజాస్వామ్యాల్లో భారత్ ఒకటి. 2006లో సచార్ కమిటీ సైతం వివక్ష వ్యతిరేక చట్టం ఆవశ్యకతను గుర్తించింది. ఈ చట్టంపై ప్రొఫెసర్ ఎన్.ఆర్.మాధవ మీనన్ నేతత్వంలోని సమాన అవకాశాల కమిషన్ సైతం దీనిని పునరుద్ఘాటించింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ప్రభుత్వం వివక్ష వ్యతిరేక చట్ట ఆలోచనను అంగీకరించినప్పటికీ.. 2014లో ప్రభుత్వం మారడంతో నిలిచిపోయింది. అయితే, వివక్ష వ్యతిరేక, సమానత్వ బిల్లు-2016ను థరూర్ లోక్‌సభలో సమర్పించి, ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. అయితే, ట్రెజరీ బెంచ్‌లు ఆసక్తి చూపకపోవడంతో ముందుకు సాగలేదు. దీంతో 2019లో లోక్‌సభ రద్దుతో ముగిసిపోయింది.ఈ నేపథ్యలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రగతిశీల చట్టాన్ని ఆమోదం దిశగా అడుగు లు వేయడం, రాష్ట్రంలోని రెండు ప్రధాని పార్టీలు ఇప్పటికే ఈ చట్టానికి మద్ధతు ప్రకటించడంతో కేరళ ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముందుకు నడుస్తోంది. దీనికోసం రాష్ట్ర శాసనసభ రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ లోని ముడో జాబితా ఎంట్రీ 8 కింద అధికారం ఉపయోగించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బిల్లు ప్రకారం.. యజమానులు, భూస్వాములు, వ్యాపారులు, సేవా ప్రదాతలు, ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నవారు, ప్రయివేట్ వ్యక్తులు ఇలా ప్రతిఒక్కరూ కులం, జాతి, సంతతి, లింగం, లింగ గుర్తింపు, లింగ వ్యక్తీకరణ, గర్భధారణ, లైంగిక దృక్పథం, మత గుర్తింపు, తెగ, వైకల్యం, భాషా గుర్తింపు, హెచ్ఐవీ, జాతీయత, వైవాహిక స్థితి, ఆహార ప్రాధాన్యత వంటి పలు అంశాల ఆధారంగా వివక్ష చూపకుండా నిషేధించబడుతుంది.