Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నుంచి పేదలను రక్షించడానికి బహిరంగ చర్చ జరగాలి.. మరింత ప్రజాస్వామ్యం అవసరం
- ప్రభుత్వ చర్యలు ప్రజలను ఆర్థిక, సామాజికంగా వేరుచేయవద్దు..
- ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్
న్యూఢిల్లీ: ''ప్రజాస్వామ్యం కేవలం ఓటింగ్‌కు సంబంధించిన యాంత్రిక చర్య మాత్రమే కాదు.. ఓపెన్ మైండెడ్‌గా ఉండటం, వాదనలు వినిపించడం, అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛలు కలిగి ఉండటం వంటి అంశాలు సైతం ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి'' అని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. తాజాగా ఆయన జాతీయ మీడియాతో వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ.. కరోనాకు సంబంధించిన విషయాలు, ప్రస్తుత దేశ పరిస్థితుల గురించి మాట్లాడారు. కరోనా సంక్షోభ సమయంలో పేదల బాధలను దూరం చేసి.. వారికి రక్షణ కల్పించడానికి బహిరంగా చర్చ జరగాలనీ, ప్రస్తుత భారతావనికి మరింత ప్రజాస్వామ్యం అవసరమని ఆయన వెల్లడించారు. మహమ్మారి సమయంలో ఎన్నికలు నిర్వహించడం, నిర్వహించకపోవడం అనేది విషాదకరమైన ఎంపిక అనీ, దక్షిణాసియా దేశాలు ఇప్పటికీ కలిసి కరోనాతో పోరడగలవని తాను నమ్ముతున్నానని చెప్పారు.
బ్రిటిష్ కాలంలో కరువులు వచ్చినప్పుడు జరిగినతప్పు బహిరంగ చర్చలను అడ్డుకోవడమేననీ అన్నారు. అయితే, స్వతంత్య్రం అనంతరం బహిరంగ చర్చలు సాధ్యం అయ్యాయి. తర్వాతి కాలంలో క్రమక్రమంగా ఇది మారుతూ.. బహిరంగ చర్చలు లేకుండా విమర్శలు, పరిశీలనలు లేకుండా మనుగడను కష్టతరం చేసేలా మార్పులోచ్చాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో బహిరంగ చర్చలు ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తాయనేదానికి ఇంగ్లాండ్‌లో యుద్ధం జరుగుతున్నప్పుడు.. రాజకీయ అంశాలు, ఆహార సమస్యలకు పరిష్కారం లభించిన తీరును ఉదహరించారు. శక్తివంతమైన బహిరంగ చర్చలో ప్రతిబింబించే పేదల ప్రయోజనాలకు సంబంధించి భారత్ సహా మహమ్మారితో బాధపడుతున్న ఏ దేశంలోనైనా పేదల బాధలను తగ్గించే పరిష్కారాలు లభించవచ్చు. కానీ ఈ విధమైన చర్యలు భారత్‌లో పెద్దగా జరగలేదని అమర్త్యసేన్ అన్నారు. దేశంలో పేదల స్వరానికి విధాన రూపకల్పనలో చోటులేకుండా పోయిందని చెప్పారు. మొదటి లాక్డౌన్ విధించినప్పుడు పేదల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడం తనను ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఉద్యోగాల కోసం కాకుండా స్వంత ప్రాంతాలకు వేళ్లే పరిస్థితి దాపురించిందనీ, లక్షలాది మంది కాలినడకనే స్వస్థలాలకు చేరుకున్నారనీ, ఈ క్రమంలో ప్రజా నిరసనల్లో కొంచెం భిన్నత్వం కనిపించిందన్నారు. పరిమిత ప్రభావం కంటే భారత్‌లో దాని కంటే ఎక్కువగా ప్రజాస్వామ్యం అవసరముందని వివరించారు.
కరోనా నేపథ్యంలో ఆకలి బాధలు ఒకప్పటి బెంగాల్ కరువు కంటే మరింత ఘోరంగానూ ఉండవచ్చునని అన్నారు. ముఖ్యంగా పేదలు, ధనికుల మధ్య ఆదాయ అసమానతలు పెరిగాయని అమర్త్యసేన్ అన్నారు. నిరుద్యోగం పెరగడంతో పాటు పేదలలో మరణాలు అధికంగా సంభవించాయన్నారు. కరోనాను అడ్డుకునే చర్యలు ప్రజలను ఆర్థిక, సామాజికకంగా వేరుచేసేలా ఉండకూడదన్నారు. అలాగే, ఫాదర్ స్టాన్‌స్వామి ప్రాణాలను రక్షించడంలో న్యాయవ్యవస్థ ఒక సంస్థగా విఫలమైందని మీరు అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అవును తాను అనుకుంటున్నాననీ, న్యాయవ్యవస్థ దాని రక్షణ పాత్రను పోషించడంలో ఎలా విఫలమైందో కనీసం మనకు వివరణ అవసరం అని సేన్ తెలిపారు. స్టాన్‌స్వామి ప్రజలకు సహాయం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించే బదులు.. చట్టపరమైన మార్గాలను ప్రతికూలంగా ఉపయోగించడంతో ఆయన జీవితాన్ని మరింత కష్టతరంగానూ.. ప్రమాదకరంగానూ మార్చిందని సేన్ అన్నారు. ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బహిరంగ చర్చను అణచివేయడం ఒకటని ఆయన చెప్పారు.