Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీఐ డిమాండ్
న్యూఢిల్లీ : క్యూబాపై అమానవీయంగా అమలు చేస్తున్న నేరపూరితమైన ఆంక్షలను అమెరికా తక్షణమే ఎత్తివేయాలని సీపీఐ(ఎం), సీపీఐ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఆర్థిక ఆంక్షలు సృష్టించిన సమస్యలపై క్యూబాలో కొంతమంది ప్రజలు ప్రదర్శనలు చేస్తున్నారు. క్యూబా ప్రభుత్వం, క్యూబా కమ్యూనిస్టు పార్టీలు వారితో మాట్లాడాయి. ఈ నిరసన ప్రదర్శనలకు అమెరికా మద్దతు వుంది. తాము విధించిన ఆంక్షల కారణంగా తలెత్తిన తీవ్ర ఆర్థిక సమస్యలను, మరోపక్క కరోనా మహమ్మారిని అవకాశంగా తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. సోషలిస్టు క్యూబాను అస్థిర పరచాలన్నదే వారి లక్ష్యంగా వుంది. క్యూబా అంతర్గత వ్యవహరాల్లో అమెరికా సామ్రాజ్యవాదపు జోక్యాన్ని సీపీఐ(ఎం), సీపీఐ తీవ్రంగా ఖండించాయి. గత 60 ఏండ్లకు పైగా అమెరికా అత్యంత అమానుషమైన రీతిలో అమలు చేస్తున్న క్రిమినల్ ఆంక్షల ఫలితమే క్యూబా ఈనాడు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు. హెల్మ్స్-బర్టన్ చట్టంలోని టైటిల్ 3 వర్తింపుతో ఆంక్షలు మరింత ఉదృతమయ్యాయి. క్యూబన్లపై అనూహ్యమైన రీతిలో భారాలు, ఇబ్బందులు మోపాయి. తీవ్రవాదానికి ప్రోత్సాహమిస్తున్న దేశంగా క్యూబాను అన్యాయంగా వర్గీకరించడం ద్వారా కరోనా సమయంలో ఈ ఆంక్షలను అమెరికా మరింత ఉధృతం చేసింది. ట్రంప్ ప్రభుత్వం అదనంగా 243 ఆంక్షలను విధించింది. ఈనాటికీ అవి అమలవుతున్నాయి. ఫలితంగా, క్యూబా ఆహార పదార్థాలను, మందుల ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులను, వ్యాక్సిన్లను, ప్రాణాధార వైద్య పరికరాలను దిగుమతి చేసుకోలేకపోతోంది. ఈ పరిస్థితులు క్యూబన్లను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగేలా క్యూబన్లను రెచ్చగొట్టేందుకు గానూ బూటకపు వార్తలను ప్రచారం చేసేందుకు అమెరికా సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తోంది. ఇదంతా జరుగుతున్నా, క్యూబా ప్రభుత్వం తన సొంతంగా వ్యాక్సిన్లను అభివృద్ధిపరుచుకుంది. కోవిడ్‌పై పోరులో ప్రపంచ దేశాలకు సాయపడింది. అన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులను, అవరోధాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తోందని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటువంటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో క్యూబా ప్రజలకు, ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు వుంటుందని ఏచూరి, రాజా ప్రకటించారు. తమ మాతృభూమి, సార్వభౌమాధికారం, సోషలిజం పరిరక్షణకు క్యూబన్లు సాగించే పోరాటంలో వారికి బాసటగా నిలవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.