Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొదుపునకు ఇంధన సెగ
- వినిమయానికి దెబ్బ : ఎస్బీఐ నివేదిక
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ హయంలో వరుసగా ఎగిసిపడుతున్న ఇంధన ధరలు ప్రజల పొదుపు సామర్థ్యాలను దెబ్బతీస్తున్నాయని ఓ కీలక రిపోర్ట్ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వినిమయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎకనామిక్ వింగ్ ఓ రిపోర్ట్‌లో విశ్లేషించింది. ప్రజలు అత్యధికంగా ఇంధనానికే ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపింది. ఈ రిపోర్ట్ విశ్లేషణ ప్రకారం.. ఎస్బీఐ కార్డుపై అత్యధికంగా గృహాలు, పన్నులు, అప్పులు, నిత్యావసరాలు, వైద్యం తదితర వాటి కోసం ఎక్కువ వ్యయం చేస్తున్నారు. వీటి కంటే ఎక్కువ ఇంధనానికి ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఎస్బీఐ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్తెలిపారు. జూన్ 2021లో ఇంధనం ఇతర తప్పనిసరి ఉత్పత్తులపై అత్యధిక కుటుంబాల వ్యయం 75శాతం పెరిగిందని ఈ రిపోర్ట్ పేర్కొంది. 2021 మార్చిలో ఇది 62శాతంగా ఉంది. దీంతో పోల్చితే దేశంలో ధరల పెరుగుదల చాలా వేగంగా ఉందని విశ్లేషించింది. మరోవైపు కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రజలు వైద్యం కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుందని వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు వైద్య వ్యయం పెరగడంతో అనేక కుటుంబాల నెలవారి బడ్జెట్ తారుమారయ్యిందని ఎస్బీఐ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో కుటుంబాలు తమ ఖర్చులను చేరుకోవడానికి పొదుపును పనంగా పెడుతున్నారని విశ్లేషించింది. దేశంలో నెలకొన్న మందగమనానికి తోడు కరోనా సంక్షోభం ఆజ్యం పోయడంతో అనేక కుటుంబాలపై అప్పుల భారం పెరిగిపోతుందని ఇటీవల ఎస్బీఐ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. అనేక కుటుంబాలు బ్యాంకింగ్, ఇతర విత్త సంస్థల నుంచి రిటైల్, పంట, వ్యాపార రుణాలు తీసుకుంటున్నాయని.. ఇది ప్రజలపై అప్పుల భారం పెరగడానికి సంకేతమని ఆందోళన వ్యక్తం చేసింది. 2019-20లో జీడీపీలో అప్పుల నిష్పత్తి 32.5 శాతంగా ఉండగా.. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో 37.3 శాతానికి చేరిందని వెల్లడించింది. ఇదే సమయంలో బ్యాంక్‌ల్లోని డిపాజిట్లు తగ్గాయని తెలిపింది. వైద్య ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. 2021-22 కుటుంబాల అప్పులు మరింత పెరుగొచ్చని.. ఇది వారి ఆర్థిక పరిస్థితులను మరింత బలహీనం చేయొచ్చని హెచ్చరించింది.