Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాద నిరోధక చట్టాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్
- పౌరులు స్వేచ్ఛను కోల్పోకుండా చూడాలని వ్యాఖ్య
న్యూఢిల్లీ : ఉగ్రవాద నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డా. ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ అన్నారు. ముఖ్యంగా రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు ఈ చట్టాన్ని వినియోగించడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య చట్టపరమైన సంబంధాలు అనే కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలను వేధించేందుకు, అసమ్మతిని అణచివేసేందుకు ఉగ్రవాద నిరోధక చట్టంతో పాటు క్రిమినల్ లాను దుర్వినియోగం చేయకూడదని అన్నారు. అర్నబ్ గోస్వామి కేసులో తాను ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ.. పౌరులు స్వేచ్ఛను కోల్పోకుండా చూడా లనీ, అందుకు చట్టాల ద్వారా వారికి రక్షణ కల్పించేందుకు ప్రాధాన్యత నిచ్చేలా కోర్టులు చూడాలని అన్నారు. ఒక్కరోజు స్వేచ్ఛను కోల్పోయినా... స్వేచ్ఛను హరించటం కిందకే వస్తుందని అన్నారు. చట్టవిరుద్ధమైన చర్యల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి మృతిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల యూఏపీఏ కింద అరెస్ట్ అయిన పలువురి కేసులు మీడియాలో ప్రధాన వార్తలుగా నిలిచాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన అసోం నేత అఖిల్ గొగోరును కూడా యూఏపీఏ కింద ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.