Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) దేశంలోని ఆర్థిక అసమానతలను మరింత పెరిగేలా చేసింది. పేద ప్రజలపై అదనపు పన్ను భారాలను మోపింది. వీటికి తోడు కరోనా మహమ్మారి వారి జీవితాలను మరింత పేదరికంలోకి నెట్టింది. మోడీ ప్రభుత్వం జీఎస్టీ చట్టాన్ని 2017 జులై 1 నుంచి దేశంలో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానంతో దేశం పరోక్షపన్ను వసూళ్లపై ఆధారపడుతున్నది. కొనుగోలు చేసిన ప్రతి వస్తువు, సేవను ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. స్థూల ఆదాయంలో పరోక్ష పన్ను వాటా గత నాలుగేండ్లుగా పెరిగింది. అయితే ఆదే స్థూల ఆదాయంలో కార్పొరేట్ సంస్థలు చెల్లించే పన్నులు తగ్గుతుండటం గమనార్హం. జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాలపై అధికంగా ఆధారపడటం భవిష్యత్తులో అసమానతను మరింత పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను, అదనపు కస్టమ్స్ సుంకం, సర్చార్జీలు, రాష్ట్ర స్థాయి విలువ ఆధారిత పన్నులు వంటి 17 పన్నులు, సుంకాలు ఈ జీఎస్టీలో అంతర్గతంగా ఉన్నాయి. 'ఒకే దేశం- ఒకే పన్ను' నినాదంతో ప్రభుత్వం జీఎస్టీ పేరుతో అదనపు భారాలను ప్రజలపై మోపింది. అధిక సంఖ్యలో సామాన్య ప్రజలను కూడా పన్ను పరిధిలోకి తీసుకురావడంతో అసమానతలకు దారితీసింది. జీఎస్టీ అమలు జరిగిన 2017-18 ఆర్థిక సంవత్సరంలో, ప్రత్యక్ష పన్నుల వాటా కేంద్ర ప్రభుత్వం స్థూల పన్ను ఆదాయ వసూళ్లలో సగానికి పైగా ఉంది. ఇది స్థూల పన్ను ఆదాయంలో 52శాతం. 2020-21 ఆర్థిక సంవత్సరంలోకి వచ్చే సరికి క్రమంగా 47శాతానికి తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్థూల పన్ను ఆదాయానికి ప్రత్యక్ష పన్ను నిష్పత్తి 49శాతం వద్ద ఉంటుందని అంచనా. స్థూలపన్ను ఆదాయంలో ఒక శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నుల నుంచి వచ్చే ఆదాయం ఈ కాలంలో బాగాతగ్గింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్థూల పన్ను ఆదాయంలో 32శాతంగా ఉన్న కార్పొరేట్ పన్ను, 2020-21 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి 24శాతానికి పడిపోయింది. 2021-22 నాటికి నిష్పత్తి 25 శాతంగా ఉంటుందని అంచనా. ప్రత్యక్ష పన్నుల కన్నా పరోక్ష పన్నులపై ఆధారపడటం బాగా పెరిగిందని ఈ సమాచారం తెలుపుతోంది. పరోక్ష పన్నులతో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ రంగాలకు ముఖ్యంగా విద్య, ఆరోగ్యంలపై వినియోగిస్తే.. ఈ ప్రభావం తటస్థంగా ఉంటుంది. కానీ ఈ రంగాలకు కేటాయించిన బట్జెట్ మొత్తం బడ్జెట్ వ్యయంలో ఒక్కశాతమే. దీంతో వ్యయంలో క్షీణత, కనిష్ట పెరుగుదల మాత్రమే జరిగిందని తెలుస్తోంది. జీఎస్టీ ప్రవేశపెట్టక ముందు.. 2016-17లో కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోసం కేటాయించిన బడ్టెట్ 2.04శాతం. 2021-22లో ఇది 2.21 శాతానికి పెరిగింది. కీలక కేంద్ర పథకాలైన ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ), ఆరోగ్య పథకాలకు కూడా భారీగా కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారితో తీవ్ర సంక్షోభంలో ఉంది.