Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరవు ఉపశమనం (డీఆర్) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 11 శాతం పెంచేందుకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. ప్రస్తుతం 17శాతంగా ఉన్న డీఏను 28శాతానికి పెంచేందుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ పెంపుదల వర్తించనున్నది. డీఏ పెంపు వల్ల రూ.34,401 కోట్ల మేర ఖజానాపై భారం పడనుందని మంత్రి వివరించారు. అలాగే 48.34 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో 1 జనవరి 2020, 1 జులై 2021, 1 జనవరి 2021న చెల్లించాల్సిన డీఏ, డీఆర్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ ఆగిపోయిన కాలానికి ఎలాంటి ఎరియర్స్ చెల్లించబోమని అన్నారు.
ఆయుష్ మిషన్ కార్యకలాపాలు పొడిగింపు
ఆయుష్ మిషన్ కార్యకలాపాలను 1 ఏప్రిల్ 2021 నుంచి 31 మార్చి 2026 వరకు పొడిగిస్తున్నామనీ, ఆయుష్ మిషన్‌కు రూ.4,607.30 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. అందులో కేంద్రం వాటా రూ.3 వేల కోట్లు, రాష్ట్రం వాటా రూ.1,607.30 కోట్లని అన్నారు. త్వరలో పశువుల కోసం అంబులెన్సులు తీసుకురానున్నట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ కాల పరిమితిని ఆరు నెలల పొడిగింపు
ఒబిసి ఉప కులాల వర్గీకరణ కమిషన్ కాల పరిమితిని మరో ఆరు నెలల పాటు, అంటే జనవరి 31 వరకు పొడిగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.9 వేల కోట్లతో కేంద్ర ప్రాయోజిత పథకం కొనసాగింపు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా ఐదేళ్ల పాటు ఇది అమలవుతుంది. నార్త్ ఈస్ట్రన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ సంస్థ పేరును నార్త్ ఈస్ట్రన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రీసెర్చిగా మార్చేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలుకు ఆమోదం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలను సవరిస్తూ, మార్పులు చేస్తూ, ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలు చేయాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. పశు సంవర్థక రంగ వద్ధితోపాటు ఈ రంగంలో నిమగమైన 10 కోట్ల మంది రైతులకు మెరుగైన ప్రతిఫలం దక్కేలా ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది.