Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్వేష రాజకీయాలకు కేరళలో స్థానంలేదు
- విభజన ఎజెండాపై వామపక్షాలు మాత్రమే పోరు
-- పేదరిక నిర్మూలనే తొలి ప్రాధాన్యత : అభినందన సభలో కేరళ సీఎం పినరయి విజయన్
- ప్రకృతి వైపరీత్యాలున్నా.. ప్రజా సంక్షేమం ఆగలేదు : ప్రకాశ్ కరత్
న్యూఢిల్లీ : ప్రత్యామ్నాయ విధానాలతో కేరళ ముందుకు వెళుతున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తమ ప్రత్యామ్నాయ విధానాలను చూసి జీర్ణించుకోలేకనే కొన్ని శక్తులు విష ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కేరళలో విద్వేష రాజకీయాలకు స్థానం లేదని, ఆ రాజకీయాలను కేరళ ప్రజలు ఎన్నటికీ అధికారంలోకి రానివ్వరని స్పష్టం చేశారు. కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బుధవారం నాడిక్కడ కేరళ హౌస్‌లో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడారు. కేరళ ప్రజలు వామపక్ష ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయాన్ని అందించారనీ, అందుకు కారణం తమ ప్రభుత్వ ప్రజానుకూల విధానాలే కారణమన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అందరికి సమాన అవకాశాల లక్ష్యంగానే తమ పాలన సాగిందన్నారు. కేరళ ప్రజలు విద్వేషాన్ని తిరస్కరించేందుకు సంసిద్ధులై ఉన్నారనీ, అదే ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైందని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు 600 హామీలు ఇస్తూ మ్యానిఫెస్టో విడుదల చేశామనీ, ఐదేండ్లలో 570 హామీలు నెరవేర్చామని వివరించారు. దాపరికం లేకుండా ప్రతి ఏడాది తమ ప్రోగ్రస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు 900 హామీలు ఇస్తూ మ్యానిఫెస్టో విడుదల చేశామనీ, మొదటి క్యాబినెట్ సమావేశంలోనే 50 హామీలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను అందించినట్టు చెప్పారు. ఇందులో పేదారికాన్ని నిర్మూలించడమే ప్రధానమైదని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లాగా జీవనోపాధి పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అందుకోసం సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీలు నియమించామన్నారు. ''ప్రధాని మోడీని కలిశాను. ఎన్నికలు అయిపో యాయి.. ఇక రాజకీయాలను వదలండి. రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం కేంద్రం బాధ్యత. మా రాష్ట్రానికి సాయం చేయమని కోరాను. అందుకు ప్రధాని చేద్దామన్నారు. అది ఎంతవరకు అమలు అవుతుందో చూద్దాం'' అని పినరయి విజయన్ అన్నారు. రాష్ట్రంలోని పరిమిత వనరులతోనే కరోనాను ఎదుర్కొన్నామని చెప్పారు. వామపక్ష రాజకీయ సైద్ధాంతిక అంశాలపై ఆధారపడి ప్రత్యామ్నాయ విధానాలతో పాలన సాగిస్తున్నామనీ, ప్రజానుకూల విధానాలు అమలు చేస్తున్నామని అన్నారు. దీన్ని కొన్ని గ్రూపులు జీర్ణించుకోలేక, తప్పుడు సమాచారంతో విష ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అయితే కేరళ ప్రజలు ఆ విష ప్రచారాన్ని తిప్పికొడతారన్నారు. ఇలాంటి విష ప్రచారాన్ని గతంలోనూ కేరళ ప్రజలు తిప్పికొట్టారనీ, ఇప్పుడు కూడా తిప్పికొడతారని తెలిపారు. దేశంలోనూ, కేరళలోనూ విభజన ఎజెండాపై పోరు చేసేదీ వామపక్షాలు మాత్రమేనని స్పష్టంచేశారు. మత సామరస్యాన్ని కాపాడటంలోనూ, లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ తమ ప్రభుత్వం అలుపెరగని కషి చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరి ఆశలు నెరవేర్చే లక్ష్యంతో ప్రజలపక్షాన పని చేస్తున్నామన్నారు.
అభివృద్ధి, ప్రజానుకూల విధానాలతో పాలన : ప్రకాశ్ కరత్
కేరళలో గత ఐదేళ్లలో ప్రకతి వైఫరీత్యాలున్నా.. ప్రజా సంక్షేమం ఆగలేదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ అన్నారు. గత ఐదేండ్లలో అభివృద్ధి, ప్రజానుకూల విధానాలతో పాలన సాగించిందని గుర్తుచేశారు. అందుకే కేరళ ప్రజలు తొలిసారి చారిత్రాత్మ విజయాన్ని చేకూర్చారని అన్నారు. లౌకిక, మతసామరస్యాన్ని కాపాడే విధానాల అమలుతో కేరళ ప్రజలు వామపక్ష ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని తెలిపారు. రెండుసార్లు భారీ వరదలు, నిఫా, కరోనా వంటి ప్రకతి వైఫరీత్యాలను కేరళ సమర్థవంతంగా ఎదుర్కొందని అన్నారు. ప్రత్యామ్నాయ విధానాలను కేరళ ప్రభుత్వం దేశం ముందు ఉంచిందని తెలిపారు. దేశంలో ఎక్కువ భాగం ఆరోగ్య రంగాన్ని ప్రయిటీకరించారనీ, కరోనా సమయంలో అది తేటం తెల్లం అయిందని అన్నారు. అయితే కేరళలో 90 శాతం కరోనా రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం తీసుకున్నారని గుర్తు చేశారు. కేరళ ఆరోగ్య వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్, హన్నన్ మొల్లా, బివి రాఘవులు, తపన్ సేన్, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, మరియం ధావలే, ఎఆర్ సింధూ, ఆర్. అరుణ్ కుమార్, సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జోన్ బ్రిటస్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పినరయి విజయన్‌కు సీఐటీయూ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, డీఎస్ఎంఎం, జన సంస్కృతి నేతలు, ఢిల్లీ అల్లర్లలో బాధిత కుటుంబాలు పుష్ప గుచ్ఛం అందజేశారు.