Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా 100వ జన్మదినోత్సవం
- స్టాలిన్, ఏచూరి ప్రభృతుల శుభాకాంక్షలు
- సుందరయ్యేనాకు స్ఫూర్తి : శంకరయ్య
చెన్నై : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ శంకరయ్య శత వంసతాలు పూర్తి చేసుకున్నారు. సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కమిటీ ఈ సందర్భంగా గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఏడాది పాటు నిర్వహించనున్న ఈ వేడు కలను సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఎర్రజెండా ఆవిష్కరించి ప్రారం భించారు. ఏచూరితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్ముడి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టికె రంగరాజన్, రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్, ఎండీఎంకే నేత వైకో, పీసీసీ ఛీప్ అళగిరి, అఖిల భారత కిసాన్ సభ, వ్యవసా య కార్మిక సంఘం నాయకులు విజు కృష్ణన్, వెంకట్ ప్రభృతులు ఈ వేడుకలకు హాజరై శంకరయ్యకు శుభాకాంక్షలుతెలిపారు. ప్రత్యేక జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.
తరతరాల స్ఫూర్తి : ఏచూరి
ఉద్యమబాటలో పయనిస్తూ తరతరాలుగా శంకరయ్య ప్రజలకు స్ఫూర్తిదాయకంగా కొనసాగతున్నారని ఏచూరి కొనియాడారు. దాదాపు 80 ఏండ్ల నుంచి నేటివరకూ ప్రజల పక్షాన ఆయన తన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రజలు కామ్రేడ్ ఎన్ఎస్ అని అప్యాయంగా పిలుచుకునే శంకరయ్య సీపీఐ(ఎం) వ్యవస్థాపక నేతల్లో ఒకరు. అప్పట్లో సీపీఐ జాతీయ కౌన్సిల్ నుంచి వాకౌట్ చేసిన 32 నాయకుల్లో ఆయన కూడా ఉన్నారు. కొవిలపట్టిలో జులై 15, 1922లో శంకరయ్య జన్మించారు. చిన్నవయస్సులోనే పెరియార్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. విద్యార్థి రాజకీయాల్లో చరుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వతంత్ర సంగ్రామంలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే 1941లో జైలుకూ వెళ్లారు. 8 ఏండ్ల పాటు జైల్లోనే ఉన్న శంకరయ్య స్వాతంత్య్రానికి కొన్ని గంటల ముందు విడుదలయ్యారు. అనంతరం తమిళనాడు అసెంబ్లీకి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1995-2002 వరకూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు.
తెలుగు ప్రజలతో విడదీయరాని బంధం
తెలుగు ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, పుచ్చలపల్లి సుందరయ్య తనకు స్ఫూర్తి అని శంకరయ్య తెలిపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చానని చెప్పగా..శంకరయ్య స్పందించి తెలుగు ప్రజలతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే యువతరం సరైన సమయంలో సరైన విధంగా తమ గళాన్ని వినిపిస్తుందని శంకరయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఇంధన, ఆహార ధరల పెరుగుదలకు లోపభూయిష్ట ఆర్థిక విధానాలే కారణమన్నారు. రాష్ట్రాల హక్కులను బీజేపీ ప్రభుత్వం కొల్లగొడుతున్నదని, భావ వ్యక్తీకరణ హక్కును హరించి వేస్తున్నారని విమర్శించారు. స్టాన్ స్వామి వంటి మానవ హక్కుల కార్యకర్తలు అణచివేతకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీపై పోరాటానికి వామపక్ష, లౌకిక శక్తుల ఐక్యతకు శంకరయ్య పిలుపునిచ్చారు.