Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది ఓ వలస చట్టం
- స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టం
- దీన్ని కొనసాగించడం దురదష్టకరం
- రాజకీయ ప్రత్యర్థులను అణచివేతకు ప్రయోగం
- పిచ్చోడి చేతిలో రాయిలా సెక్షన్ 124-ఏ
- దీన్ని తొలగించే విషయం ఆలోచించాలి : కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : రాజద్రోహ చట్టం ఓవలస చట్టమనీ, 75 ఏండ్ల స్వాత్రంత్యం తరువాత కూడా ఈ చట్టం కొనసాగించడం అవసరమా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీని రాజ్యాంగ చెల్లు బాటును పరిశీలిస్తామన్న కోర్టు దీనిపై సమాధాన మివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రాజద్రోహం కేసులు పెట్టడానికి వీలు కలిగిస్తున్న భారతీయ శిక్షాస్మతి (ఐపీసీ)లోని సెక్షన్ 124-ఏ చట్టాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎన్జి వాంబాత్కరే దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ రిషికేష్ రారు నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాజద్రోహ చట్టం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాజద్రోహ చట్టం బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలస చట్టం. స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడానికి ఉద్దేశించబడింది. 1870లో స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటీష్ వారు ఈ చట్టం తీసుకొచ్చారు. భారతీయుల అణచివేతకు తెల్లదొరలు దీన్ని ఉపయోగించారు. గాంధీ, తిలక్ వంటివారిని ఈ చట్టంతోనే అణచివేయాలని చూశారు. ఇప్పుడు మనకు స్వాత్రంత్యం వచ్చి 75 ఏండ్లు అవుతోంది. ఇప్పుడు కూడా ఈ చట్టం అవసరమా' అని జస్టిస్ ఎన్వి రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు.
కొనసాగించడం దురదృష్టకరం
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తరువాత ఈ తరహా చట్టాలు కొనసాగించడం దురదృష్టకర మని సీజేఐ పేర్కొన్నారు. పాత కాలపు.. పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు? అని ప్రశ్నించారు. పిటిషనర్ దేశ రక్షణ కోసం తన జీవితమంతా త్యాగం చేశాడనీ, ఇది ప్రేరేపిత వ్యాజ్యంగా అనలేమని సీజేఐ పేర్కొన్నారు.
పిచ్చోడి చేతిలో రాయిలా...
'రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని? అందులో నిలబడుతున్నవి ఎన్ని? సెక్షన్ దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న సందర్భాలే ఎక్కువ. ఈ చట్టంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పేకాట ఆడేవారిపైనా దేశద్రోహం కేసులు పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల అణచివేత కోసం దీన్ని తప్పుగా వినియోగిస్తున్నారు. ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా వ్యవహరిస్తున్నారు. బెయిల్ రాకుండా కక్ష సాధింపు, అధికార దాహంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు, వ్యక్తులను బెదిరించే స్థాయికి దిగజారుతున్నారు. రాజద్రోహం సెక్షన్ 124-ఏ పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. కొయ్యను మలిచేందుకు రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టుంది' అని జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు.
చట్టాన్ని తొలగించేందుకు ఆలోచించాలి
రాజద్రోహం సెక్షన్ 124-ఏ తొలగింపునకు ఆలోచించాలని ధర్మాసనం ఈ సందర్భంగా కేంద్రాన్ని సూచించింది. ఈ చట్టం రద్దుపై వైఖరిని తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటన్నింటినీ ఒకే సారి విచారిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తరపు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ ఇదే అంశంపై పిటిషన్లు జస్టిస్ యుయు లలిత్ ధర్మాసనం ముందు పెండింగ్లో ఉన్నాయని, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారని తెలిపారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టు నోటీసులు అంగీకరించారు. పిటిషనర్ తరపు న్యాయవాది పిబి సురేష్ వాదనలు వినిపించారు. ఇదే అంశంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఎడిటర్స్ గిల్డ్ తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. ఇదే అంశంపై 32 పిటిషన్లు ఉన్నాయనీ, రాజ్యాంగబద్ధతను సవాల్ చేశాయని తెలిపారు. రాజద్రోహ చట్టం దుర్వినియోగానికి గురవుతుందని అన్నారు.