Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా మూడో వేవ్ పొంచివున్నవేళ ఈ యాత్రలేంటి? అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్వర్ యాత్రను రద్దు చేయాలని యూపీతో సహా పలు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని అనుమతించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. జీవించే హక్కు కంటే మత విశ్వాసా లేమీ ముఖ్యం కాదని ధర్మాసనం కీలకవ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశముందన్న సంకేతాల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం జులై 25 నుంచి కన్వర్ యాత్రకు భక్తులను అనుమతివ్వటం చర్చనీయాంశమైంది. యూపీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం కావటంతో, దీనిని సుమోటాగా పరిగణి ంచిన సుప్రీంకోర్టు, విచారణ జరిపి..కేంద్రానికి నోటీసులు కూడా జారీచేసింది.కోర్టు ఆదేశాలమేరకు యూపీ ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది.విస్తృతమైన చర్చల తర్వాత కన్వర్ యాత్రను కోవిడ్ ఆంక్షలు, పరిమితుల నడుమ లాంఛనప్రాయంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. అయితే దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ''దేశ ప్రజల ఆరోగ్యం, జీవించే హక్కు అన్నింటి కంటే ముఖ్యమైంది. ఇతర విశ్వాసాలు, మతపరమైన అంశాలు అన్నీ కూడా ఈ ప్రాథమిక నిబంధనకు లోబడే ఉంటాయి'' అని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ యాత్రను భౌతికంగా, లాంఛనప్రాయంగా..ఏ రూపంలోనూ నిర్వహించడం తగదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కన్వర్ యాత్రపై యోగి సర్కార్ పునరాలోచన చేయాలని సూచించింది. లేదంటే తామే ఆదేశాలివ్వాల్సి వస్తుందని స్పష్టం చేసింది. వచ్చే సోమవారంలోగా తమ నిర్ణయాన్ని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణను జులై 19వ తేదీకి వాయిదా వేసింది.కన్వర్ యాత్రపై కేంద్రం అఫిడవిట్ దాఖలుచేసింది. హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకురావడానికి కన్వరియాలకు (యాత్రికులకు) అనుమతి ఇవ్వొద్దని రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రం తెలిపింది. అయితే మతవిశ్వాసాలను అనుసరించి శివాలయాల వద్ద ట్యాంకర్ల ద్వారా గంగాజలం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గంగాజలం పంపిణీ చేసుకోవలసిందిగా భక్తులకు సూచించామని సుప్రీంకోర్టు తెలిపింది.