Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్థాన్‌లో ధరలు పెరగడంతో పోల్చుతూ
- కేంద్రం వైఫల్యాలను కప్పిపుచ్చే యత్నం : విశ్లేషకులు
న్యూఢిల్లీ : భారత్‌లోని మోడీ అనుకూల మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విశ్లేషకులు తెలిపారు. ఇందుకోసం పాకిస్థాన్‌లోని పరిస్థితులను భారత్‌లోని పరిస్థితులతో పోల్చుతూ ప్రభుత్వ 'అనుకూల' వార్తలను తయారు చేస్తున్నదని ఆరోపించారు. ముఖ్యంగా భారత్‌లో ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యవసరాల ధరల విషయంలో మోడీ ప్రభుత్వ వైఫల్యంపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆ వర్గం మీడియా తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలను, భారత్‌లోని పెట్రోల్ ధరలతో పోల్చుతూ మోడీ అనుకూల మీడియా ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నదని విశ్లేషకులు తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 5.40 లు పెంచిందనే వార్తతో మొదలు పెట్టి పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారు ణంగా ఉన్నదని కథనాలు మొదలు పెట్టాయన్నారు. అయితే, వాస్తవానికి పాకిస్థాన్‌లో పెట్రోల్‌పై రూ. 5.40 లు పెరిగి ధర రూ. 118.09 కి చేరింది. కానీ, భారత రూపాయితో పోల్చితే పాకిస్థాన్ రూపాయి 47 పైసలతో సమానమని విశ్లేషకులు గుర్తు చేశారు. ఈ లెక్కన చూసుకుంటే, పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు భారత కరెన్సీ విలువలో రూ. 55 లు అవుతుందని తెలిపారు. భారత్‌లోని పెట్రోల్ ధరలతో పోల్చుకుంటే పాకిస్థాన్‌లోనే ధర సుమారు సగం అని చెప్పారు. ఇలాంటి విషయాలు తెలపని మోడీ మీడియా.. తప్పుదారి పట్టించే వార్తలను ప్రసారం చేయడం గమనార్హమని అన్నారు. కాగా, పాక్, భారత్‌లోని పెట్రోల్ ధరలను పోల్చుతూ మోడీ సర్కారు వైఫల్యంపై సామాజిక మాద్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.