Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ - జూన్‌లో రూ.10వేల కోట్లు
- ఐపీఓకు దన్ను..!
ముంబయి : ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీ ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా రికార్డ్ లాభాలను ఆర్జించింది. గడిచిన ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా రూ.10,000 కోట్ల లాభాలు సాధించిందని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఇద్దరు అధికారులు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21) ముగింపు నాటికి ఎల్ఐసీ రూ.94,000 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లో మొత్తం పెట్టుబడులు రూ.8 లక్షల కోట్లకు చేరాయి. అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్న ఎల్ఐసీ ఎప్పటి నుంచో ఉన్న షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో రికార్డ్ లాభాలను ఆర్జించినట్టు ఆ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.20,000 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో షేర్ల విక్రయం ద్వారా రూ.10వేల కోట్ల లాభాలు ఆర్జించినట్టు పేరు చెప్పుకోవడానికి ఆసక్తి లేని ఆ ఉన్నతాధికారులు తెలిపారు.
కరోనా రెండో దశ ఉదృతంగా ఉన్నప్పటికీ జూన్ 30 నాటికి స్టాక్ మార్కెట్లు 6 శాతం పెరగడంతో ఎల్ఐసీికి లాభాల ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి. ఎల్ఐసీ రికార్డ్ లాభాలతో మెగా ఐపీఓ వైపు ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వానికి సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ - జూన్ కాలంలో ఎల్ఐసీ మార్కెట్ల నుంచి రూ.7,000 కోట్ల లాభాలు సాధించింది. అదే ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో రూ.15వేల కోట్ల లాభాలు ఆర్జించింది. ఎల్ఐసీ గురువారం ముగింపు ధర ఆధారంగా జూన్ త్రైమాసికంలో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో తన వాటాను రూ. 3,149 కోట్లను తగ్గించుకుంది. గడిచిన త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బయోకాన్, హీరో మోటో కార్ప్ సూచీల్లో షేర్లను వాటాలను విక్రయించింది. మరో 17 కంపెనీల్లోని షేర్లను అమ్మకానికి పెట్టింది. ఆర్థిక సంవత్సరం 2020-21 ఎల్ఐసీ మొత్తంగా పలు విభాగాల్లో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో సగం ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లకు కేటాయించగా.. 15 శాతం మౌలిక వసతుల సంబంధిత రంగానికి. 35 శాతం ఈక్వీటీలు, ఎన్సీడీలు, మ్యూచువల్ ఫండ్స్, వాణిజ్య పేపర్లలో పెట్టుబడి పెట్టింది. సాధారణంగా 15-20 శాతం ఈక్విటీ మార్కెట్‌కు కేటాయించడంతో... ఈ విలువ రూ.75,000 కోట్లు నుంచి రూ.1 లక్ష కోట్ల మేర కేటాయించారని ఎల్ఐసీ అధికారి పేర్కొన్నారు. ఎల్ఐసీకి దేశ వ్యాప్తంగా 12 లక్షల ఏజెంట్లను కలిగి ఉంది.