Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ వాణిజ్య రాజధాని ముంబయి భారీ వర్షాలతో తడిసిముద్దయింది. గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ముంబయి మహానగరం, దాని శివారు ప్రాంతాలు నీటమునిగాయి. శుక్రవారం ఉదయం దాదాపు మూడు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. ముంబయి నగరంలో 24 గంటల్లో (శుక్రవారం 8.30గంటలకు) 64.45 మిల్లీమీ టర్ల వర్షపాతం, తూర్పు సబర్బన్ ప్రాంతంలో 120.67, పశ్చిమ సబర్బన్‌లో 127.16 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జుహూలో 136 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం కుర్లా వద్ద మీఠీ నదిలో నీటి మట్టం 3.7 మీటర్లకు పెరిగింది. దాంతో సమీపంలోని క్రాంతీ నగర్లో ఉండే వందాలాది కుటుంబాలను వేరే చోటకు తరలించారు.
నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ముందుగానే వెల్లడించింది. పూణె, రారుగడ్, రత్నగిరి, కొల్హాపూర్, సతారా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. ముంబయి అర్బన్, సబర్బన్ ప్రాంతాల్లో శుక్రవారం పలు బస్సు సర్వీసులు, లోకల్ రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. రైల్వే ట్రాక్‌లపై నీరు చేరడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తూర్పు ముంబయిలోని చాలా ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపైకి నీరు చేరింది. దాంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
రానున్న 24 గంటల్లో ముంబయి, ఠాణె, ఇతర మహరాష్ట్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక సాయంత్రం సమయంలో ముంబయి తీరంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశమున్నట్టు తెలిపింది. నవీ ముంబయి, రారుగఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కుర్లా-విద్యావిహార్ వద్ద భారీ వర్షం వల్ల నీరు చేరడంతో రైళ్ల రాకపోకలను దారిమళ్లించారు. కుర్లా, సియోన్ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల బస్సుల రాకపోకలను మళ్లించారు.
ఆగుడే లేదు..
మంగళవారం నుంచి ముంబయిలో ఎడతెగని వానలు కురుస్తున్నాయి. జూన్ 1 తర్వాత ఇప్పటి వరకు ముంబయిలో 1291 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంకన్నా 48శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత వారం రోజుల్లో 302 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.