Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్య తరగతిలో పెరిగిన ఆందోళన
- వలస కార్మికులే కాదు.. మధ్య తరగతిలోనూ ఆకలి సమస్య
- ఏడాదిన్నరగా ఉపాధిలేక ఆర్థిక కష్టాల్లో కుటుంబాలు
- నగరాలు, పట్టణాల్లో సాయం కోసం ఎదురుచూపులు
దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న ఒక సామాన్య
కుటుంబీకురాలు చంచల్ దేవీ(35). గత ఏడాది
మార్చిలో కరోనా సంక్షోభం, లాక్డౌన్ దెబ్బకు
ఆమె భర్త ఉద్యోగం పోయింది. అప్పట్నుంచీ ఈ
దంపతుల కష్టాలు రోజు రోజుకీ పెరగసాగాయి.
ఇంటి ఖర్చులు తగ్గించుకోవటం కోసం పాలు
కొనటం మానేశారు. నెలా నెలా వచ్చే ఆదాయం
పూర్తిగా లేకపోవటంతో అప్పులు చేయక
తప్పలేదు. ఏడాదిదాటినా ఇప్పటికీ వారికి
ఉపాధి దొరకలేదు. భార్యాభర్త ఇద్దరూ రేపటి
గురించి ఆలోచిస్తూ...ఆందోళన చెందుతున్నారు.
న్యూఢిల్లీ : నేడు దేశంలో కుటుంబ ఆదాయం లేక ఆందోళన చెందుతున్న చంచల్ దేవీలాంటి వ్యక్తులు అడుగడుగునా ఉన్నారు. భర్త ఉద్యోగం పోయిందని, పిల్లలకు సరిగా కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నామని కోట్లాదిమంది మహిళలు ఆవేదన చెందుతున్నారు. 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్ ఎకానమీ' (సీఎంఐఈ) తాజా గణాంకాల ప్రకారం కరోనా సంక్షోభం తలెత్తాక..గత 12 నెలల కాలంలో ఎన్నో పేద, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి తారుమారైంది. ఈ ఏడాది రెండో వేవ్ మొదలయ్యాక ఒక్క మే నెలలోనే ఒక కోటీ 50 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఆకలి సమస్య పెరిగింది. ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో పోషకాహార సమస్యతో బాధపడుతున్నవారిలో మూడోవంతు భారత్‌లో ఉన్నారని తేలింది.
దేశంలో ఆకలి సమస్య ఎంత తీవ్రంగా ఉందో రేషన్ సరుకుల కోసం వచ్చిన జనాల్ని చూస్తే అర్థమవుతుందని సామాజిక కార్యకర్త అదితీ దివ్వేదీ అన్నారు. లాక్డౌన్ దెబ్బకు ఆదాయం పడిపోయిందని, దాంతో ఇంట్లో ఆహారంపై ఖర్చు తగ్గించుకోవాల్సి వచ్చిందని అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీ అధ్యయనంలో పాల్గొన్న 90శాతం మంది చెప్పారు. అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు అమిత్ బాసోల్ మాట్లాడుతూ, ''గత ఏడాది లాక్డౌన్, కరోనా కష్టాలు విభిన్నమైనవి. కొన్ని నెలలపాటు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది మళ్లీ వైరస్ తాకిడి తీవ్రస్థాయిలో ఉంది. పేదలు, మధ్య తరగతి పొదుపు మొత్తాలన్నీ కరిగిపోయాయి. రుణాలు చేయాల్సి వచ్చింది. కరోనాకు పూర్వంనాటి ఆదాయాలు పొందే అవకాశాలు కనిపించటం లేదు'' అని అన్నారు.
మధ్య తరగతిలోనూ ఆహార సమస్య
ముంబయికి చెందిన 'ఖానా చాహీయే' అనే ఎన్జీఓ సంస్థ గత ఏడాది ఏప్రిల్ నుంచి వలస కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న వలస కార్మిక కుటుంబాలకు ఆహార పొట్లాల్ని, రేషన్ సరుకుల్ని అందజేస్తోంది. తమను ఆదుకోవాలని ముంబయి నుంచేగాక, పూణె, బెంగుళూరు నగరాల నుంచి కూడా ఫోన్‌కాల్స్ వచ్చేవని ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు స్వరాజ్ షెట్టి చెప్పారు. ''ఆహారం, రేషన్ సరుకుల కోసం గత ఏడాది ఎక్కువగా వలస కార్మికుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చేవి. ఈ ఏడాది మధ్య తరగతి నుంచి కూడా సహాయం ఫోన్‌కాల్స్ వస్తున్నాయి'' అని ఆమె చెప్పారు.
థర్డ్ వేవ్ వస్తే ఎలా?...
ఆదాయాలు కోల్పోయి, అష్టకష్టాలు పడుతున్నవేళ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఢిల్లీలో ఇంటి పని చేసుకొని జీవనం సాగిస్తున్న బీహారీ మహిళ సలీకా బేగం ఏమంటున్నారంటే..'' గత ఏడాది లాక్డౌన్ రాగానే మా స్వంత ఊరికి వెళ్లిపోయాను. ఉన్న పని పోయింది. నగరంలో ఉండి ఉంటే నేను, నా ముగ్గురు పిల్లలు ఆకలితో అలమటించేవారు. ఏడాది తర్వాత పరిస్థితులు మారాయి..పని దొరుకుతుందని ఢిల్లీకి వచ్చాం. అయితే నిత్యా వసర సరుకుల ధరలు భరించలేని విధంగా ఉన్నాయి. పప్పులు, వంటనూనె..మొదలైనవాటి ధరలు ప్రభుత్వాలు నియంత్రించలేవా? ప్రభుత్వం నుంచి ఆమాత్రం ఆశించకూడదా? మూడో వేవ్ వస్తే మా పరిస్థితి ఏంది?