Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ మరికొన్ని రోజుల్లో రాబోయే థర్డ్‌వేవ్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనేక సర్వేలు, నిపుణులు, విశ్లేషకులు థర్డ్‌వేవ్ గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కరోనా టీకాలు గణనీయమైన పనితీరును కనబర్చాయని ఐసీఎంఆర్ నివేదిక పేర్కొంది. మరీ ముఖ్యంగా కరోనా సోకినప్పటికీ ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితితో పాటు మరణాలలను సైతం తగ్గించడంలో కరోనా టీకాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. కోవిడ్-19 టీకాలు తీసుకున్న అనంతరం కరోనా బారినపడ్డవారిపై ఈ అధ్యయనం కొనసాగింది. ఐసీఎంఆర్ తాజాగా ఆ వివరాలను వెల్లడించింది. ఐసీఎంఆర్ నివేదిక వివరాల ప్రకారం.. టీకాలు తీసుకున్న వారిలో కరోనా వ్యాప్తితో పాటు ప్రాణాలకు ముప్పు తక్కువగా ఉంటుంది. కరోనా సెకండ్‌వేవ్ సమయంలో నిర్వహించిన ఈ అధ్యయనం దేశంలోనే మొదటి అధ్యయనంతో పాటు అతిపెద్దదని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 677 మంది కరోనా సోకిన వారిపై అధ్యయనం చేసింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత కూడా 80 శాతం మందికి అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ సోకిందని ఈ నివేదిక పేర్కొంది. అయితే, వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో మరణ రేటు చాలా తక్కువగా ఉందనీ, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా తగ్గిందని తెలిపింది. ఈ 677 మంది కరోనా బాధితుల్లో 71 మంది కోవాక్సిన్ తీసుకోగా, మిగిలిన 604 మంది కోవిషీల్డ్, మరో ఇద్దరు చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 86.09 శాతం మంది డెల్టా వేరియంట్ బారినపడ్డారు. వీరిలో 9.8 శాతం మందికే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాగా, మరో 0.4 శాతం మంది మరణించారని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే ఎన్ని కరోనా వేవ్‌లు వచ్చినా.. మరణ రేటు తక్కువగా ఉంటుందని తెలిపింది.