Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీఐ నివేదికలతో స్పష్టం.. ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా ఉధృతి మొదలైన కరోనా సెకండ్‌వేవ్ కాలంలో కరోనా టీకాలు కోవాక్సిన్, కోవిషీల్డ్‌లకు ఆర్డర్లు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ లోపాయికారీ విధానంపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ముందుకు సాగుతూ.. టీకాల సేకరణను ఆలస్యం చేసిందని విమర్శించాయి. దీని కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ప్రభుత్వ పబ్లిసిటీ వింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ నివేదికలను కొట్టిపారేస్తూ... అందులో వాస్తవం లేదని తెలిపింది.
అయితే, తాజాగా సమాచార హక్కు చట్టం కింద అడిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ స్పందనలు.. మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవమైనవేనని స్పష్టం చేస్తున్నాయి. మే 3న పీఐబీ '' కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. సీరం, భారత్ బయోటెక్లతో చివరి టీకా ఆర్డర్లు మార్చి 2021లో ఇచ్చినట్టు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి పూర్తిగా తప్పు. ఇందులో వాస్తవం లేదు'' అని పేర్కొంది. మే, జూన్, జులైలకు సంబంధించి ఏప్రిల్ 28న కోవిషీల్డ్ టీకాల కోసం సీరం సంస్థకు రూ.1.732.50 కోట్ల అడ్వాన్స్ విడుదల చేసిందనీ, ఆదే రోజు భారత్ బయోటెక్‌కు సైతం 5 కోట్ల డోసుల కోసం రూ.787.50 కోట్ల ఆడ్వాన్స్ ఇచ్చినట్టు'' పేర్కొంది. అయితే, ఆర్టీఐ కార్యకర్త, కమోడోర్ లోకేశ్ బాత్రా (రిటైర్డ్) దాఖలు చేసిన ఆర్టీఐ అప్పీలుకు ప్రతిస్పందనగా.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ఇటీవల హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ కొనుగోలు ఆర్డర్లను వెల్లడించింది. మార్చి మధ్య నుంచి పీఐబీ మే 3న తన వాదనలు వినిపిం చేంత వరకు ప్రభుత్వం తాజా టీకా ఆర్డర్లు చేయలేదని స్పష్టంగా తెలిసింది. వ్యాక్సిన్ కొనుగోలుకు మొత్తం ఆరు ఆర్డర్లు ఇవ్వగా.. మూడు సీరం సంస్థకు 10 కోట్ల డోసుల కోసం మొదటి ఆర్డర్ మార్చి 12, రెండో ఆర్డరు మే 5న 11కోట్ల మోతాదులకు, జూన్ 8న 25 కోట్ల మోతాదులకు ఇచ్చారు. ఇక భారత్ బయోటెక్‌కు మార్చి 12న 2 కోట్ల డోసులకు, మే 5న 5కోట్ల డోసులకు, జూన్ 8న 19 కోట్ల డోసులకు ఆర్డర్లు ఇచ్చారు. అలాగే, పీఎం కేర్స్ ఫండ్ సైతం సీరంకు టీకాల కోసం 4 ఆర్డర్లు ఇచ్చినట్టు ఆర్టీఐ నోట్ పేర్కొంది. అందులో జనవరి 11న 1.10 కోట్ల డోసులు, ఫిబ్రవరి 4న కోటీ డోసులు, అదే నెల 13న 1.5కోట్ల డోసులు, ఫిబ్రవరి 25న 2 కోట్ల డోసులకు ఆర్డర్లు ఇచ్చింది. అలాగే, భారత్ బయోటెక్‌కు జనవరి11న 50 లక్షల డోసులకు, ఫిబ్రవరి 3న 45 లక్షల డోసులకు ఆర్డర్లు ఇచ్చింది. దీనిపై స్పందించిన బత్రా ''మీడియా నివేదికలు సరైనవని నిస్సందేహంగా రుజువుచేస్తున్నాయని'' అన్నారు. కరోనా పంజా విసురుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సరైన సమయంలో టీకాలు సేకరించకపోవడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారంటూ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.