Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైెతులపై రాజద్రోహం కేసులా?
- రోడ్ల దిగ్బంధనం
- ఎస్పీ, మంత్రుల ఇండ్ల ముట్టడికి యత్నం
సిర్సా : రైతాంగ ఆందోళనలతో హర్యానాలోని సిర్సా జిల్లా అట్టుడుకుతోంది. రాష్ట్రంలో 100 మందికి పైగా రైతులపై రాజద్రోహం, హత్యాయత్నం కేసుల నమోదు, తదనంతరం చోటుచేసుకున్న ఐదుగురు రైతుల అరెస్టును నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు శనివారం సిర్సా జిల్లా ఎస్పి కార్యాలయంతో పాటు మంత్రులు దుష్యంత్, రంజిత్ సింగ్ నివాసాల ముట్టడికి రైతులు పెద్దయెత్తున కదలి వచ్చారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా బారికేడ్లను పెట్టారు. రైతులు సిర్సా చేరుకోకుండా చేసేందుకు శుక్రవారం నుంచే అన్ని జిల్లాల్లో 10 వేల మంది పోలీసులు, ఇతర బలగాలను మోహరించారు. మంత్రుల నివాసాల చుట్టూ ఖాకీల వలయాన్ని ఏర్పాటు చేశారు. బారికేడ్లను, నిర్బంధాన్ని అధిగమించి రైతులు ముందుకు సాగారు. ఈ సమయంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చర్చలకు పిలిచారు. ఈ నెల 11న సిర్సాలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రణబీర్‌ను అడ్డుకున్న ఘటనకు సంబంధించి రైతులదే తప్పన్నట్లుగా ఎస్పి అర్పిత్ జైన్ ఓ కల్పిత వీడియోను చూపారు. దీనిని రైతు నాయకులు తిరస్కరిస్తూ బయటకు వచ్చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రతిజాతి చౌక్‌తో పాటు సిర్సా-బర్నాలా జాతీయ రహదారిని దిగ్భంధించి ఆందోళన చేపట్టారు. రైతులకు పోలీసులు పెట్టిన తప్పుడు కేసులను తక్షణం ఉపసంహరించుకొని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల్లో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతు నేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ పోలీసుల వద్ద ఎటువంటి ఆధారాలు లేవని, రైతులపై నిందలు మోపేందుకు, శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ, పోలీసుల వైఖరికి నిరసనగా కొనసాగుతున్న ఆందోళల్లో భాగంగా సిర్సాలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు.