Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవస్థలు గాడితప్పినవేళ ప్రజలవైపే నిలబడతాం..
- న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై ప్రజలకు నమ్మకముంది..
- ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత సుప్రీంపైన్నే ఉంది : సీజేఐ ఎన్.వి.రమణ
న్యూఢిల్లీ: వ్యవస్థలు గాడి తప్పుతున్నాయని ప్రజలు భావిస్తే...సుప్రీంకోర్టు ప్రజలవైపే నిలబడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై ప్రజలకు ఎంతో నమ్మకముందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత సుప్రీంకోర్టుపై ఉందని ఆయన అన్నారు. 'ఇండో సింగపూర్ మీడియేషన్ సమ్మిట్, 2021' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతుల చేపట్టిన ఎన్.వి.రమణకు సింగపూర్ చీఫ్ జస్టిస్ సుదర్శ్ మీనన్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీజేఐ ఎన్.వి.రమణ ప్రసంగిస్తూ ఏమన్నారంటే...ఏ సమాజంలోనైనా సంఘర్షణలు, వివాదాలు ఉంటాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కారణాలు సమాజంలో సంఘర్షణలకు, వివాదాలకు కారణమవుతున్నాయి. అయితే సమాజంలోని సంఘర్షణలు, వివాదాల్ని పరిష్కరించే న్యాయవ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి. వివాద పరిష్కారానికి సంబంధించి ఇండియా, ఇతర ఆసియా దేశాల్లో ఘనమైన సాంప్రదాయ చరిత్ర, పద్ధతులు ఉన్నాయి. హింసకు తావు ఇవ్వకుండా వివాదాన్ని పరిష్కరించుకోవాలని మహాభారత కథ మనకు సూచిస్తోంది. కృష్ణుడు నడిపిన మధ్యవర్తిత్వం విఫలమవ్వటం వల్లే మహాభారత యుద్ధం జరిగింది...అని సీజేఐ అన్నారు.లక్షలాది కేసులు పెండింగ్లో ఉండటానికి కారణం కోర్టులేనని నిందించటం సరైంది కాదని సీజేఐ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. 24 గంటల క్రితం దాఖలైన కోర్టు కేసు కూడా..కోట్లాది పెండింగ్ కేసుల లెక్కల్లోకి వస్తోంది. కేవలం పెండింగ్ కేసుల సంఖ్యను చూపి న్యాయవ్యవస్థ పనితీరును నిర్ణయించటం సరైంది కాదని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా? గొప్పగా పనిచేస్తుందా? అనేదానికి పెండింగ్ కేసులు ఒక సూచికగా తీసుకోరాదని అన్నారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరగడానికి కారణం అత్యంత ఖరీదైన కేసుల సుదీర్ఘ విచారణే కారణమని చెప్పారు. కరోనా పరిస్థితుల వల్ల కూడా కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరగడానికి దారితీసిందని చెప్పారు.