Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ప్రభుత్వం ద్వంద్వనీతి
- వైసీపీ పార్లమెంటరీ నేత వి. విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ. ఎనిమిదేండైనా కేంద్రం విభజన చట్టం హామీలను నెరవేర్చలేదనీ, ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తోందని వైసీపీ పార్లమెంటరీ నేత వి. విజయసాయి రెడ్డి విమర్శించారు. బీజేపీ పక్షపాత ధోరణి అవలంభిస్తున్నదని ఆరోపించారు. పోలవరం, ప్రత్యేక హౌదా అంశాల్లో కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నదని తెలిపారు. అఖిలపక్షం సమావేశ అనంతరం విజరు చౌక్ లో వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డితో కలిసి విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న సవతి తల్లి ప్రేమను ద్వంద్వ ప్రమాణాలను మానుకోవాలని స్పష్టంగా చెప్పామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వైసీపీ వ్యతిరేకిస్తున్నట్టు అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పామని విజయసాయి రెడ్డి తెలిపారు. నష్టాల్లో ఉన్న ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థను పురుద్ధరించి, దాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి, కానీ ఏకంగా తెగనమ్మడం పరిష్కారం కాబోదని అన్నారు. గడచిన పాండిచ్చేరి శాసన సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పాండిచ్చేరికి ప్రత్యేక హౌదా ఇస్తామని హామీ ఇచ్చిందనే విషయాన్ని సమావేశంలో ప్రస్తావించినట్టు చెప్పారు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే సరికి ఆర్థిక సంఘం పేరు చెప్పి ప్రత్యేక హౌదా ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నదన్నారు.
ఫిరాయింపులపై కేంద్రం వైఖరి సరిగా లేదు
ఫిరాయింపుల అంశంపై కేంద్రం వైఖరి సరిగాలేదనీ, అనర్హత పిటిషన్‌పై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెలిపారు.. శరద్ యాదవ్ విషయంలో నోటీసులు ఇచ్చి.. వారం రోజుల్లోనే అనర్హత వేటు వేశారని గుర్తు చేశారు. ఏడాది కిందట వైసీపీ అనర్హత పిటిషన్ ఇస్తే... 11 నెలల తరువాత స్పీకర్ నిద్ర లేచారని చెప్పారు. అలానే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించకుండా 29 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, కేంద్రం నుంచి ఏపికి రావల్సిన రూ. 5,056 కోట్ల బియ్యం సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరామని అన్నారు.
తెలంగాణ నుంచి బకాయిలు ఇప్పించండి
జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసే రేషన్ కార్డుల సంఖ్య విషయంలో నెలకొన్న అసమానతలను కూడా సమావేశంలో ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.6,112 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాలని, విద్యుత్ బకాయిలను ఇప్పించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెప్పారు.