Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో మరణించిన ఫొటో జర్నలిస్టు దానిష్ సిద్ధిఖీ అంత్యక్రియలు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) యూని వర్సిటీ శ్మశానవాటికలో జరగనున్నాయి. ఈ మేరకు కుటుంబసభ్యుల అభ్యర్ధనకు వైస్ ఛాన్స్లర్ అంగీకారం తెలిపినట్టు యూనివర్సిటీ తరపున ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. సాధారణంగా వర్సిటీ ఉద్యోగులు, జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలు మరణించిన సమయంలో వారి అంత్యక్రియలకు ఈ శ్మశానవాటికను వినియోగిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు, ప్రభుత్వ బలగాలకు మధ్య కొనసాగుతున్న పోరును చిత్రీకరిస్తున్న సిద్ధిఖీ శుక్రవారం తుపాకీ గుళ్లకు బలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాయిటర్స్ మీడియా సంస్థ తరపున ఫొటోజర్నలిస్టుగా పనిచేస్తున్న దానిష్ సిద్ధిఖీ 2018లో పులిట్జర్ అవార్డు పొందారు. జామియా యూనివర్సిటీలోనే సిద్దిఖీ తన మాస్టర్స్ చేశాడు. అదేవిధంగా ఆయన తండ్రి అక్తర్ సిద్దిఖీ కూడా ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్‌గా ఉన్నారు. డానిష్ సిద్దిఖీ 2005-2007 వరకు ఎజెకె మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్(ఎంసీఆర్సీ)లో చదువుకున్నారు. డానిష్ సిద్దిఖీ మరణానికి జామియా టీచర్స్ అసోసియేషన్ (జేటీఏ) సంతాపం ప్రకటించింది.