Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : మానవ హక్కుల ఉద్యమవేత్త ఫాదర్ స్టాన్‌స్వామికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఇతర రాజకీయ నాయకులు ఆదివారం నివాళులర్పించారు. స్టాన్‌స్వామికి జరిగిన విషాదం ఇంకెవ్వరికీ జరగకూడదని స్టాలిన్ ఈ సందర్భంగా తెలిపారు. భీమా కోరెగావ్ కేసుకు సంబంధించి తలోజా సెంట్రల్ జైల్లో సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన స్టాన్‌స్వామి ఇటీవల ముంబయి ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని లయోలా కాలేజ్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్, లోక్‌సభ సభ్యులు కనిమెళి, దయానిధి మారన్, రాష్ట్ర మంత్రి కె.పొన్ముడి, రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ పీటర్ అల్ఫోన్స్, ఎంఎల్ఎ సింధనై సెల్వాన్, ఇతర నేతలు నివాళులర్పించారు. గిరిజన ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం స్టాన్‌స్వామి పోరాటం చేశారని, రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ అమలు కోసం ప్రశ్నించారని సెక్రెటేరియట్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. గిరిజన సలహా మండలి కోసం స్టాన్‌స్వామి పిలుపునిచ్చారనీ, ఆదివాసీ ప్రజల భూముల రక్షణ కోసం పోరాడారని గుర్తు చేసింది. అలాగే, అణగారిన వర్గాల కోసం పోరాడిన స్టాన్‌స్వామికి జరిగిన విషాదం మరెవరికీ జరగకూడదని ముఖ్యమంత్రి స్టాలిన్ తన సంతాప సందేశంలో తెలిపారు.