Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభ కాంగ్రెస్‌పక్ష నేతగా అధిర్ రంజన్,రాజ్యసభకు ఖర్గే
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ గ్రూపులను ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పునర్వ్యవస్థీకరించారు. కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, మనీశ్ తివారీ, అంబికా సోనీ, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్ వంటివారికి స్థానం కల్పించారు. లోక్‌సభ, రాజ్యసభలలో కాంగ్రెస్ సమర్థవంతంగా పని చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం ఒక లేఖలో సోనియా గాంధీ పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో ఈ గ్రూపులు ప్రతి రోజూ సమావేశమవు తాయనీ, పార్లమెంటు సమస్యలకు సంబంధించి అవసరమైనపుడు ఇంటర్ సెషన్ పీరియడ్స్‌లో కూడా సమావేశం కావచ్చునని తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా పశ్చిమ బెంగాల్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కొనసాగుతారు. మనీశ్ తివారీ, శశి థరూర్, గౌరవ్ గొగోరు (ఉప నేత), కె. సురేశ్ (చీఫ్ విప్), రవనీత్ సింగ్ బిట్టు (విప్), మాణిక్యం ఠాగూర్ (విప్)లకు ఈ గ్రూపులో చోటు లభించింది. మనీశ్ తివారీ, శశి థరూర్‌లకు పార్లమెంటరీ గ్రూపులో చోటు కల్పించడాన్ని బట్టి పార్టీ పార్లమెంటరీ నిర్ణయీకరణ ప్రక్రియలో సీనియర్లను భాగస్వాములను చేయాలని సోనియా భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు రావాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసినవారిలో శశి థరూర్, మనీశ్ తివారీ కూడా ఉన్నారు. వీరిద్దరికీ ఆ పార్టీ పార్లమెంటరీ గ్రూపులో స్థానం లభించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ గ్రూపు నేతగా మల్లికార్జున ఖర్గే కొనసాగుతారు. ఆనంద్ శర్మ (ఉప నేత), జైరామ్ రమేశ్ (చీఫ్ విప్), అంబికా సోనీ, పి చిదంబరం, దిగ్విజరు సింగ్, కెసి వేణుగోపాల్ సభ్యులుగా నియమితులయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయంలో ఈ పార్లమెంటరీ గ్రూపులు సమావేశాలు నిర్వహిస్తాయి. అవసరమైనపుడు ఈ గ్రూపుల సంయుక్త సమావేశాలను కూడా నిర్వహిస్తారు. సంయుక్త సమావేశానికి కన్వీనర్‌గా మల్లికార్జున ఖర్గే వ్యవహరిస్తారు.