Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెన్షన్ నిబంధనల్లో మార్పులను వ్యతిరేకిస్తూ మాజీ బ్యూరోక్రాట్స్ ప్రధానికి లేఖ
న్యూఢిల్లీ : కేంద్ర పెన్షన్ నిబంధనల్లో మోడీ సర్కార్ చేసిన కీలక మార్పులపై మాజీ బ్యూరోక్రాట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. ఈ నిబంధనలు భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్తాయని లేఖలో వారు ఆరోపించారు. కొత్త పెన్షన్ నిబంధనల ప్రకారం..కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు..ఎక్కడా కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వం గురించి మాట్లాడరాదు, వ్యాసాలు రాయరాదు, పుస్తకాలు ప్రచురించరాదు. ప్రభుత్వ పాలనలో తనకున్న అనుభవాన్ని, కరెంట్ అంశాల్ని, సమస్యల్ని విశ్లేషించడం వంటివి ఆ మాజీ ఉద్యోగి చేయటం కుదరదు. ఒకవేళ అది చేయాలంటే కేంద్రం నుంచి అనుమతి తప్పనిసరి. పెన్షన్ నిబంధనల్లో ఈ మార్పులపై దేశవ్యాప్తంగా మాజీ బ్యూరోక్రాట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
'' తన సర్వీస్మేరకు పెన్షన్ పొందే హక్కు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉంది. తీవ్రమైన నేరాలు, చెడు నడవడి ఉన్నదని దోషిగా తేలితేనే అతడు పెన్షన్ పొందే హక్కు కోల్పోతాడు. ఉద్యోగ విరమణ చేశాక స్వేచ్ఛగా మాట్లాడవద్దు, మాట్లాడితే పెన్షన్ అమలుజేయమనేది ఎక్కడా లేదు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలాంటి నిబంధనలు లేవు. ప్రభుత్వం, పాలనకు సంబంధించి అత్యంత కీలక సమాచారం బయటపెట్టరాదనే చట్టం ఇప్పటికే ఉంది. ఉద్దేశపూర్వకంగా, స్వార్థంకోసం ప్రభుత్వ రహస్యాల్ని బయటపెట్టినట్టయితే, అతడిపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, 1923 ప్రకారం విచారణ చేయవచ్చు'' అని లేఖలో బ్యూరోక్రాట్స్ పేర్కొన్నారు.
విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ ఎన్ఎస్ఏ శ్యామ్ సరన్, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి(మాజీ ఐఎఫ్ఎస్) శివశంకర్ మీనన్, కర్నాటక మాజీ డీజీపీ జూలియో రిబీరియో, మాజీ ఐఏఎస్ అజరు విక్రం సింగ్, మాజీ ఐపీఎస్ ఎ.ఎస్.దౌలత్..మొదలైన 100మందికిపైగా ప్రఖ్యాత బ్యూరోక్రాట్స్ ఈ లేఖపై సంతకం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన కేంద్ర పెన్షన్ నిబంధనల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. భద్రతా కారణాలు చూపి తమ నోరు నొక్కటమేనని, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయటమేనని వారు ఆరోపించారు. ఏదైనా సభలోగానీ, సెమినార్లోగానీ, ఇంటర్వ్యూలోగానీ ఇకపై మాజీ బ్యూరోక్రాట్స్ స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.