Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
- రాజ్యాంగం వల్లనే ప్రశ్నించే హక్కు
న్యూఢిల్లీ: 'రాజ్యాంగం మనకు ప్రశ్నించే హక్కును.. విధులను కల్పించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ఆయన తండ్రి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవీ చంద్రచూడ్ 101 జయంతిని పురస్కరించుకుని శిక్షణ్ ప్రసారక్ మండల్ (ఎస్పీఎం) శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''రాజ్యాంగమే మనకు ధ్రువనక్షత్రమనీ, సంక్లిష్ట సమస్యలకు అదే దారి చూపుతుంది'' అని అన్నారు. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల చర్యలు, నిష్క్రియపై తీర్పు చెప్పేదీ రాజ్యాంగమేనని తెలిపారు. 'మీ స్వేచ్ఛకు ప్రమాదం పరిపాలనలో ఉన్నవారితో పాటు సమాజంలోని అసహనంతో కూడా ఉద్భవించవచ్చుననీ, అయితే, రాజ్యాంగం రక్షణ కవచంలా కాపాలా కాస్తుందని వెల్లడించారు. అలాగే, రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నివాళులు సైతం అర్పిస్తూ.. భారత్లో అత్యంత ప్రముఖమైన కుల వ్యతిరేక న్యాయవాది ఆయన అని పేర్కొన్నారు. దళిత వర్గానికి చెందిన అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న పలు అంశాలను సైతం ప్రస్తావించారు. రాజ్యాంగ చరిత్రను అథ్యయనం చేయవల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న రంగంతో పనిలేకుండా రాజ్యాంగ చరిత్ర, నైతికతను అధ్యయనం చేయాలని సూచించారు. 2017 ఆగస్టు 24న తొమ్మిది మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం వ్యక్తిగత గోప్యత హక్కు (రైట్ టు ప్రైవసీ)పై ఇచ్చిన చరిత్రాత్మక తీర్పునకూ రాజ్యాంగమే మార్గదర్శి అంటూ జస్టిస్ డీవై చంద్రచూడ్ వివరించారు.