Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదాల్లో 32 మంది మృతి
- పట్టాలపై నీళ్లు.. ఆగిన రైళ్లు
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇండ్లపై కొండచరియలు పడి 29 మంది మృతిచెందారు. మరో ఇద్దరు విద్యుత్ ఘాతంతో మరణించారు. రైల్వే ట్రాక్‌లన్నీ నీట మునగడంతో సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే తమ సర్వీసులను రద్దు చేశాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున మహుల్ ప్రాంతంలోని భరత్‌నగర్ వద్ద కొన్ని ఇండ్లపై కొండచరియల పడడంతో 19 మంది మరణించగా, ఏడుగురికి తీవ్రంగా గాయలయ్యాయి. గాయపడ్డవారిని రాజావడీ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు రాత్రి వరకూ కొనసాగాయి. విక్రోలి ప్రాంతంలోనూ గుడిసెలపై కొండ చరియలు పడి 10 మంది మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భండుప్ వద్ద కొండచరియలు పడి 16ఏండ్ల బాలుడు మరణించాడు. ఆంధేరి షాప్ వద్ద 26 ఏండ్ల వ్యక్తి, కండివలి తూర్పు వద్ద 21 ఏండ్ల వ్యక్తి విద్యుత్ షాక్‌లతో మరణించారు. వర్షం కారణంగా తమ ఇంటిలో వస్తువులను తరలించే క్రమంలో వీరు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. నగరంలో అనేక ప్రాంతాల్లో మంచినీటి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారత వాతా వరణశాఖ ముంబయి నగరానికి రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. రానున్న ఐదురోజుల్లో నగరంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.