Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలు సాగుతున్న తీరు ఆందోళనకరం
- ప్రతిసారి న్యాయస్థానాలు కలుగజేసుకోవాలా?
- ప్రస్తుత పరిస్థితులపైమేధావులు, విశ్లేషకులు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వాల పాలన తీరు.. ముఖ్యంగా చట్టాల ఉల్లంఘన, కరోనా సంక్షోభంలోనూ ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలను విస్మరించడం, మతగ్రంథాల మక్కువపై మేధావులు, విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రభుత్వాలు అమలు చేయాల్సింది మత గ్రంథాలను కాదనీ, రాజ్యాంగాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. ప్రపంచ మానవాళిపై కరోనా మహామ్మారి విరుచుకుపడుతూ ప్రజల ప్రాణాలను హరిస్తుంటే మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వాలు మొగ్గు చూపడం ఆందోళనకరమనీ, ఈ విషయంలో ఇప్పటికే చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో మొదలైన థర్డ్‌వేవ్.. భారత్‌లోనూ సమీపిస్తున్న తరుణంలో న్యాయవ్యవస్థ వాటిని మరింత చురుగ్గా నిరోధించాలని కోరుతున్నారు.
ప్రస్తుతం అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న భారత సమాజం మళ్లీ పలు సాధారణ విషయాలు తెలుసుకోవాలి. 70 సంవత్సరాలకు పైగా గణతంత్ర దేశమైన భారత్‌లో సార్వభౌమత్వం ప్రజలపై ఉంటుంది కానీ మత గ్రంథాలతో కాదు. మరీ ముఖ్యంగా రాజ్యాంగం, దాని కింద ఉన్న చట్టాల ద్వారా పాలన సాగుతుందనేది వాస్తవం. ''చారిత్రాత్మక చార్ధామ్ యాత్ర ప్రత్యక్ష ప్రసారం చేయాలనే ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తంచేసినప్పుడు ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పై విషయాలను గుర్తు చేసింది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. భారత్ ఒక ప్రజాస్వామ్యం దేశం. ఇక్కడ చట్టపాలన సాగుతుంది. మత గ్రంథాలది కాదు'' అనే సందేశానిచ్చింది. నిజానికి హైకోర్టు.. ప్రభుత్వానికి తన రాజ్యాంగ విధులను గుర్తు చేయడానికి ఈ విషయంలో జోక్యం చేసుకుంది. కుంభమేళాకు హాజరుకావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను బహిరంగంగా ఆహ్వానించినప్పుడు.. కరోనా సమయంలో ఇది ''సూపర్ స్ప్రెడర్ ఈవెంట్''గా మారుతుందని హైకోర్టు నిర్ద్వంద్వంగా హెచ్చరించింది. ఈ విషయంలో కొద్ది మంది భావాలను పరిగణనలోకి తీసుకోకుండా, కరోనా నుంచి ప్రతిఒక్కరినీ రక్షించాలనే తర్కాన్ని కోర్టు ఇచ్చింది. ఇక కర్నాటకలో మతపరమైన ప్రదేశాలలోని లౌడ్ స్పీకర్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో పోలీసులను కోర్టుకు పిలిచి.. కాలుష్య నిబంధనలతో సంబంధం లేకుండా తమ ఆదేశాలను అమలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యామూర్తి గోవింద్ మాథూర్ సైతం ఈ విషయాలను సమర్థిస్తున్నారు. ఆయన పదవిలో ఉన్న కాలంలో ఎన్కౌంటర్లు, లవ్ జిహాద్ వంటి ఏకపక్ష చర్యలు, విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున్న విమర్శలు ఎదుర్కొన్నది. ఏఏంయూలో పోలీసుల క్రూరత్వం, పౌరులపై ప్రభుత్వ అనధికారిక నిఘా, ఇంటింటికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన అవసరం, ఖైదీల మానవ హక్కులు రక్షణ సహా పలు ముఖ్యమైన కేసులు గురించి తెలిసిందే. ఇక శబరిమల మెజారిటీ తీర్పు (4-1) సైతం లింగ వ్యత్యాసాలు చూపడం రాజ్యాంగ విరుద్ధమనీ, మహిళల ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమనీ పేర్కొంటూ.. కేరళ హిందూ ప్రజా ఆరాధాన స్థలాల చట్టం రూల్ 3(బీ)ని కొట్టేసింది. ఇక ఓ పత్రిక కవర్‌పై హిందూ దేవుడు విష్ణువుగా చిత్రీకరించిన సమయంలో మతపరమైన మనోభావాలనున దెబ్బతీసే కేసును ఎదుర్కొన్న ప్రసిద్ధ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యతిరేకంగా నమోదైన పిటిషన్ న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఎఎం ఖాన్విల్కర్, ఎంఎం శాంతనాగౌదార్లు తిరస్కరించారు. మతపరమైన భావాలను దెబ్బతీస్తాయనే కోణంలో చూడకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తంగా చెప్పాలంటే న్యాయవ్యవస్థ ''పౌర హక్కులపై దాడి చేసే అల్లరిమూకలకు మద్దతు'' ఇచ్చే ''మెజారిటీ కార్యనిర్వాహక వర్గం''కు వ్యతిరేకంగా అనేక సందర్భాలలో నిలబడింది.
ప్రస్తుతం కన్వర్ యాత్రకు సానుకూలంగా ముందుకు సాగాలని యూపీ సర్కారు నిర్ణయించనట్టు వార్తలు వచ్చాయి. అయితే, కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచివుందని పెద్ద పెద్ద సమావేశాలకు అనుమతించడం ప్రమాకరమనీ, ఈ విషయంలో నిపుణుల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒడిశాలోని పూరీ, గుజరాత్‌లోని అహ్మాదాబాద్లలో జగన్నాథ యాత్ర వేడుకల విషయంలో పునరాలోచించుకోవాలని ఐఏంఏ సహా నిపుణులు, విశ్లేషకులు ప్రభుత్వాన్ని కోరారు. కేవలం ఏదో ఒక మాతానికి ఈ విషయాలు పరిమితం కాలేదు. ఇక దేశంలో కోవిడ్-19 టీకా కార్యక్రమం సైతం పూర్తి కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. భారత్ తన 140 కోట్ల జనాభాలో కేవలం 4 శాతం కంటే తక్కువ టీకాలు వేసింది.
అనేక ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు అమెరికాతో పోలుస్తూ.. మెరుగైన స్థానంలో ఉన్నామని చూపుతున్నారు. కానీ యూఎస్ తన జనాభాలో 46.62 శాతం మందికి పూర్తిగా టీకాలు వేసిందనే విషయాన్ని గుర్తెరగాలి. రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మత రాజకీయం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తూనే ఉన్నది. న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తున్న మోడీ సర్కారు మారటం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాజ్యాంగ సూత్రాలు, విలువలకనుగుణంగా నిలబడటం, విశ్వాస ఆధారిత ముసుగులో మత రాజకీయాలు పెరుగుతున్నప్పుడు, న్యాయమూర్తులకు అంత తేలికైన పని కాదని విశ్లేషకుల వాదన.