Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరుగుతున్న వలసలు
- యూపీలో కార్మికులకు తప్పని తిప్పలు
లక్నో : యూపీలో వలసకార్మికులు 'ఉపాధి' తిప్పలు తప్పడంలేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద వారికి పని దొరకడం కష్టంగా మారింది. పని దొరికినవారికి వేతనాల చెల్లింపులు సరిగ్గా జరగడం లేదు. దీంతో అలాంటి కార్మికులు తమ సొంత గ్రామాల్లో ఉండలేక తిరిగి ఇతర రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
''తక్కువ వేతనాలు, కష్టమైన పని పరిస్థితులు, ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు వలస కార్మికులను నిరాశకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులపై కష్టపడి పనిచేసినప్పటికీ వేతనాల చెల్లింపులు సకాలంలో జరగవు. నిబంధన ప్రకారం, ఒక కార్మికుడు 15 రోజుల్లో వేతనం పొందాలి. అయితే, ఈ నిబంధన మాత్రం సరిగ్గా అమలవ్వడం లేదు'' అని శుభం అనే కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. '' ఉపాధి హామీ పని గంటల్లో చేసే శ్రమకు ప్రయివేటు కంపెనీలు, ఇతర నిర్మాణ సంస్థలు చాలా ఎక్కువగా చెల్లిస్తున్నాయి. అయితే, ఉపాధి హామీలో తక్కువ చెల్లింపులకు ఒక కార్మికుడు పని చేయాలని ఎలా కోరుకుంటాడు?'' అని అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాకు మా సొంత గ్రామాన్ని విడిచి వెళ్లడం అయిష్టంగానే ఉన్నప్పటికీ ఉపాధి హామీ పరిస్థితులు మమ్మల్ని అటువైపుగా వెళ్లేలే చేస్తున్నాయన్నారు.
యూపీవ్యాప్తంగా అనేక జిల్లాల్లో కార్మికులకు వేతనాలు ఇంకా రాలేదని యూపీ ఉపాధి హామీ కర్మచారి మహాసంగ్ ఆరోపించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ వెబ్సైట్ సమాచారం ప్రకారం.. జులై 12న హర్దోయి జిల్లాలో ఒక్క రోజులో 5,389 మంది జాబ్ హౌల్డర్లు పనిని వదిలిపెట్టారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో ఇది మరింత కఠిన పరిస్థితులను సృష్టిస్తుందని కార్మికులు తెలిపారు.
కాగా, యూనియన్ పిలుపు మేరకు కార్మికులు ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. '' సమాన పనికి సమాన వేతనం'' డిమాండ్‌తో పాటు '' అవకతవకలకు'' వ్యతిరేకంగా ఆందోళన చేశారు. '' గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, చెరువు లేదా కాలువ తవ్వడం, రోడ్లు, మరుగుదొడ్లు లేదా తోటల నిర్మాణం మొదలైన పనులు ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం కింద జరుగుతాయి. కానీ, పూర్తి పని సాధారణంగా చేయదు'' అని యూనియన్ నాయకుడు అరవింద్ శుక్లా వివరించారు. ప్రస్తుత కఠిన పరిస్థితులతో ఉద్యోగాల కోసం తాము మహారాష్ట్రలోని పూణేకు వెళ్లాలని యోచిస్తున్నామని బలరాంపూర్ జిల్లాకు చెందిన వలసకార్మికులు తెలిపారు. '' ప్రయివేటు పనికి వెళ్తే కార్మికులకు రోజుకు రూ. 350 నుంచి రూ. 450 లు అందుతున్నాయి. పని అయిన వెంటనే ఆ మొత్తాన్ని పొందుతారు. కానీ, ఉపాధి హామీ కింద అందేది మాత్రం రూ. 203. అది కూడా 15 రోజుల తర్వాత కార్మికుడి చేతికి చేరుతుంది'' అని వారు వాపోయారు. కాగా, ఈ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 1.10 లక్షల మంది కార్మికులు నమోదయ్యారు. ఇందులో 30వేల మంది కూలీలు మాత్రమే పని చేస్తున్నారు. మిగిలిన 80 వేల మంది కార్మికులు తమ జీవనోపాధి కోసం వేరే రాష్ట్రానికి వెళ్లడం లేదా స్వయం ఉపాధిని చేపట్టడం వంటివి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ విషయంలో కలుగజేసుకొని కార్మికులు డిమాండ్ చేశారు.