Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని ప్రశ్నించిన బాంబే హైకోర్టు
- అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు
ముంబయి: దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు రక్షించడానికి టీకాలు అత్యంత కీలకం. అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం అందించే టీకాల విషయంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై దాఖలైన ఓ పిటిషన్పై బాంబే హైకోర్టు స్పందిస్తూ.. వివిధ రాష్ట్రాలకు కరోనా టీకాల కేటాయింపులు, పంపిణీకి సంబంధించిన విధానం, పద్ధతులు ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. సంబంధిత వివరాలు వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోవిన్ పోర్టల్, యాప్ ద్వారా టీకాలు పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, టీకాల అందజేత వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ముంబయికి చెందిన యోగీతా వంజార దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది జంషీద్ మాస్టర్.. ప్రస్తుతం ముంబయిలో కేవలం 14 లక్షల మందికి మాత్రమే పూర్తిగా టీకాలు వేయగా, 50 లక్షల మందికి వ్యాక్సిన్ మొదటి మోతాదు అందిం దని కోర్టు తెలిపారు. నగర జనాభాలో కేవలం ఆరు శాతం మందికి మాత్రమే పూర్తి టీకాలు వేశారనీ, ఈ లెక్కన పౌరులందరికీ పూర్తిగా టీకాల వేయడానికి 2-3 సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. కాగా, వ్యాక్సిన్ కేటాయింపు అంశంపై కేంద్రాన్ని ఆదేశించలేమనీ, ఈ జాతీయ విధానమని ధర్మాసనం పేర్కొం ది. అయితే, వ్యాక్సిన్ తయారీ దారుల ఆర్డర్లు, టీకా డెలివరీ కాల వ్యవధిని వివరిం చాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే, టీకా మోతాదులను వివిధ రాష్ట్రాలకు అందుబాటులో ఉంచే విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వివరించాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై తమ స్పందనను తెలియజేయవాలని సూచిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.