Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నింటిపైనా చర్చకు సిద్ధం : అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోడీ
- ధరలు పెరుగుదలతో సహా ప్రజా సమస్యలన్నీ చర్చించాలి : ప్రతిపక్షాలు
- రైతుల అంశంపై ప్రతిపక్షాల వాయిదా తీర్మానం
న్యూఢిల్లీ : నేటీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావే శాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు సమావే శాలు జరుగుతాయి. మొత్తం 19 రోజులు సమావేశాలు ఉంటాయి. ఉభయ సభలు కరోనాకు పూర్వం ఉన్న వేళల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకకాలంలో పనిచేస్తాయి. లోక్‌సభ సభ్యులకు సంబంధించి 280మంది సభ్యులు సభా ఛాంబర్లో, 259మంది సభ్యులు గ్యాలరీలో కూర్చుంటారు. పార్లమెంట్ ఆమోదం కోసం మొత్తం 17 కొత్త బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక అమలులో ఉన్న ఆరు ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జనాభా నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో పాటు విద్యుత్ బిల్లును కూడా మరోసారి సభ ముందుకు తీసుకురానున్నారు.
మరోవైపు ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రతిపక్షం పట్టుపడుతోంది. ఈమేరకు ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, వంట నూనెలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, నిరుద్యోగం, కరోనా పరిస్థితి, సాగు చట్టాలపై రైతుల ఆందోళన, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చకు లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఇలా అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్రతిపక్షాలు సిద్ధమవగా.. వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సహకరించండి : ప్రధాని మోడీ
వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం అఖిల పక్షం భేటీ అయ్యింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతత్వంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. 33 పార్టీలకు చెందిన 40 మందికి పైగా నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను మంత్రి ప్రహ్లాద్ జోషి అఖిల పక్ష నాయకులకు వివరించారు. ఈ సమావేశాల్లో కొత్త, పాత బిల్లులతో సహా దాదాపు 31బిల్లులను ఆమోదానికి పార్లమెంట్ ముందుకు వస్తాయని, దాదాపు అన్ని సమస్యలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అఖిల పక్షానికి తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో ఆరోగ్యకరమైన, అర్ధవంతమైన చర్చలు జరుపుదామని, పార్లమెంటరీ నియమ నిబంధనలకు అనుగుణంగా సభలో లేవనెత్తే ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి హాజరైన నేతలు సహా ప్రతి ఒక్కరు సూచనలు తమకెంతో విలువైనవని పేర్కొన్నారు.
కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధం
ఏయే అంశాలు చర్చించాలనే విషయమై సమావేశంలో పాల్గొన్న నేతలు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా దేశంలో నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఉద్యమం, కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొన్న తీరుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా విజంభిస్తోన్న తరుణంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించ లేదంటూ కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. కరోనా, నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, రైతుల ఉద్యమం, రాఫెల్ ఒప్పందం, ధరల పెరుగుదలతో పాటు ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పియుష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, మురళీధరన్, మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్‌సిపి), సుధీప్ బందోపాధ్యాయ, డెరిక్ ఒబ్రెయిన్ (టీఎంసీ), టిఆర్. బాలు, తిరుచ్చి శివ (డీఎంకే) , రాం గోపాల్ యాదవ్ (ఎస్పీ), సతీష్ చంద్ర మిశ్రా (బీఎస్పీ), ప్రసన్న ఆచార్య, పినాకి మిశ్రా (బీజేడీ), సంజరు రౌత్, వినాక్ రౌత్ (శివసేన), ఎలమరం కరీం, పిఆర్. నటరాజన్ (సీపీఐ(ఎం)), బినరు విశ్వం (సీపీఐ), ఎన్.కె. ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్), సంజరు సింగ్ (ఆప్), వి.విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి (వైసీపీ), కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్ (టీడీపీ), బషీర్ (ఐయుఎంఎల్), హర్ సిమ్రాత్ కౌర్ (ఎస్ఏడీ), రాజీవ్ రంజాన్ సింగ్ (జేడీయూ), అనుప్రియ పటేల్ (అప్నా దళ్), పశుపతి పరస్ (ఎల్జేపీ), రాందాస్ అథ్వాలే (ఆర్పీఐ) తదిత రులు పాల్గొన్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా లోక్‌సభ పక్షనేతలతో సమావేశం నిర్వహిం చారు. లోక్‌సభ కార్యకలాపాలు సజావుగా నిర్వహిం చేందుకు సహకరించాలని అన్ని పక్షాలను కోరారు.
తెలుగు రాష్ట్రాల పార్టీల ప్రాధాన్య అంశాలు
తెలుగు రాష్ట్రాల పార్టీలు కూడా తమ సమస్యలను ప్రధానంగా లేవనెత్తనున్నాయి. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ ఉక్కు వంటి కీలక అంశాలను లేవనెత్తేందుకు వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఏపి ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతల అంశాలను లేవనెత్తాలని టీడీపీ నిర్ణయించింది. మరోవైపు కేంద్ర జలశక్తి గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని టీఆర్ఎస్ లేవనెత్తనుంది.
రైతుల అంశంపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ నిబంధనలను తుంగలో తొక్కి ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని గత ఎనిమిది నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల ఆందోళన అంశంపై ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. ఆదివారం నాడిక్కడ ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, టిఎంసి, ఎన్‌సిపి, సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్, ఆర్ఎస్పి, శివసేన, ఆప్ పార్డీల నేతలు పాల్గొన్నారు. రైతుల సమస్యలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో పాటు కీలకమైన అంశాలను లేవనెత్తేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రైతుల అంశంపై చర్చకు వాయిదా తీర్మాన నోటీసులు ప్రతిపక్ష నేతలు ఇచ్చినట్లు ఆర్ఎస్పి నేత ఎన్.కె. ప్రేమ్ చంద్రన్ తెలిపారు. అలాగే రాజకీయ పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ అంశంపై కూడా వాయిదా తీర్మానం ఇచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు ఎన్‌డిఎ పక్షాల సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, హౌం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, టిఎంసి నేత జికె వాసన్, జెడియు నేత రామ్ నాథ్ ఠాకూర్, అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్, ఎల్జెపి నేత పసుపతి కుమార్ పరస తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు.