Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్రిక్తతకు దారితీసిన చలో తాడేపల్లి
- ఎక్కడికక్కడే విద్యార్థి, యువజనుల అరెస్టు
అమరావతి : ఉద్యోగాలడిగినందుకు నిరుద్యోగులపై రాష్ట్రప్రభుత్వ ఉక్కుపాదం మోపింది. జాబ్‌లెస్ క్యాలెండర్ కాదు ..జాబ్‌లు ఉన్న క్యాలెండర్‌ను విడుదల చేయాలంటూ నినదించి యువజన, విద్యార్థుల గొంతు నొక్కింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి సోమవారం నిర్వహించిన చలో తాడేపల్లి (సిఎంకు వినతిపత్రం) కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. విజయవాడ, గుంటూరుల నుండి తాడేపల్లికి దారితీసే అన్ని రోడ్లలోనూ పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. ఎక్కడ నలుగురు విద్యార్థులు, యవజనులు కనిపించినా అదుపులోకి తీసుకున్నారు. ప్రతిఘటించిన వారిని బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించారు. సోమవారం మధ్యా హ్నాం వరకు కొనసాగిన ఈ అరెస్ట్‌ల పరంపరతో అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త, ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య ప్రజానీకానికి ఏం జరుగుతోందో అర్దం కాని స్థితి ఏర్పడింది. ఇంత నిర్బంధాన్ని ప్రయోగించినా కొందరు తాడేపల్లి సెంటర్‌వరకూ చేరుకుని నిరుద్యోగ గళాన్ని వినిపించారు. పోరాట సమితి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35,794 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఎఐవైఎస్, ఎఐఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, పిడిఎస్యు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తాడేపల్లికి తరలిరానున్నారన్న సమాచారంతో పోలీసులు రెండు రోజుల నుండే విస్తృత తనిఖీలు చేపట్టారు. అరెస్ట్‌లకు దిగారు. సోమవారం కూడా ఇదికొనసాగింది. అడుగడుగునా మొహరించిన పోలీసులు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. వాటర్ క్యానన్లు సిద్ధం చేశారు. విజయవాడలోని కళాక్షేత్రం, జాతీయ రహదారి, తాడేపల్లి మొత్తం పోలీసు వలయంగా మారింది. అయినా అడ్డంకులను దాటుకొని విద్యార్ధి, యువజన సంఘాల నాయకులు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. ఉద్యోగాల భర్తీకి నినాదాలు చేస్తూ . పోలీసుల వలయాన్ని చేధించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. విజయవాడ నగరంలో ఉద్రికత్త సాగుతుండగానే తాడేపల్లిలో జాతీయ రహదారిపై నుండి పలువురు సిఎం ఇంటికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సుమారు 50 మంది నాయకులు జాతీయ రహదారిపై నుంచి పాత టోల్గేట్ వద్దకు దూసుకొచ్చారు. వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను పోలీసులు ఈడ్చిపారేశారు.