Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టాన్ స్వామి పనిపట్ల తమకు గౌరవముంది
- బాంబే హైకోర్టు వ్యాఖ్యలు
ముంబయి: భీమా కోరేగావ్ హింస కేసులో అరెస్టయిన పలువురు హక్కుల కార్యకర్తలు, వారిలో కొందరు సీనియర్ సిటీజన్లు గత మూడేండ్లుగా వారిపై చార్జిషీట్లు నమోదుచేయకుండా జైల్లో ఉన్న విషయాన్ని ప్రస్తువిస్తూ బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు సంభాజీ షిండే, నిజామూదిన్ జమదార్లతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ)ను విచారణ లేకుండా అండర్ ట్రయల్ కింద ఎన్నేండ్లు జైల్లో ఉంచుతారంటూ ప్రశ్నించింది. ఇంకా ఎంతమందిని ప్రశ్నిస్తారు? ఎన్నేండ్లు పడుతుంది? వేగవంతమైన విచారణ ప్రాథమిక హక్కు అని పేర్కొంది. వైద్యం కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ హక్కుల కార్యకర్త, గిరిజనుల సంక్షేమం కోసం తన జీవితాంతం పోరాటం సాగించిన ఫాదర్ స్టాన్ స్వామి పిటిషన్‌ను ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో స్టాన్‌స్వామి గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. స్టాన్‌స్వామి పట్ల, అతను సమాజానికి అందించిన పనిపట్ల తమకు గొప్ప గౌరవం ఉందని ధార్మసనం పేర్కొంది. ''బెంచ్ తనను ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. స్టాన్‌స్వామి అద్భుతమైన వ్యక్తి. సమాజానికి అటువంటి సేవలను అందించాడు. ఇప్పుడు చట్టపరమైన స్థానంలో సంబంధం లేకుండా సమాజానికి ఆయన చేసిన పనిపట్ల చాలా గౌరవం ఉంది'' అని జస్టిస్ షిండే అన్నారు. అలాగే, సాధారణంగా టీవీ చూడననీ, సమయం తక్కువగా ఉంటుందనీ, కానీ స్టాన్‌స్వామి అంత్యక్రియలను టీవీలో చూశాననీ, గ్రేస్‌ఫుల్‌గా ఉందన్నారు. కాగా, సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయి ''స్టాన్‌స్వామి మరణానికి కారణాలు వేతకడం లేదనీ, విచారణ పేరిట అంతిమంగా అతని మరణానికి దారితీసిందని'' కోర్టుకు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలనీ, నివేదికలను హైకోర్టులో దాఖలు చేయాలని తాను కోరుతున్నానని మిహిర్ దేశాయి పేర్కొన్నారు.