Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానుకోవాలని ఎస్కేఎం హితవు
- రైతు పార్లమెంట్ మార్చ్ ఆందోళన మాత్రమే.. ముట్టడి కాదు
- సమస్యలపై సమాధానం చెప్పలేకనే.. ప్రధాని ఎదురు దాడి
న్యూఢిల్లీ : రైతు పార్లమెంట్ మార్చ్ ఆందోళన మాత్రమేనని.. ముట్టడికాదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. పార్లమెంట్ వద్ద ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు ఢిల్లీ పోలీసులకు అందచేశామని తెలిపింది. అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాగే ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఢిల్లీ పోలీసులకు హితవు పలికింది. రైతు ఉద్యమానికి మద్దతుగా లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల నిరసన కార్యక్రమం నిర్వహించటాన్ని ఎస్కేఎం అభినందించింది. ఈ మేరకు సోమవారం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయనీ, పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు రైతుల డిమాండ్లు లేవనెత్తారని తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల ఎంపీలకు ఎస్కేఎం ప్రజా విప్ జారీ చేసిందనీ, కొంతమంది ఎంపీలను ఎస్కేఎం బృందం ప్రత్యక్షంగా కలిసి విప్‌ను అందజేసినట్టు తెలిపారు. అందులో భాగంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు రైతుల సమస్యలను లేవనెత్తారనీ, రైతుల నినాదాలను హౌరెత్తించారని ఎస్కెేఎం నేతలు తెలిపారు. అయితే రైతుల డిమాండ్లను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తితే, దానికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష ఎంపీలపై ప్రధాని ఎదురుదాడికి దిగారని ఎస్కెేఎం నేతలు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా సభ్యుల పట్ల ప్రతిపక్షాలకు గౌరవం లేదని ప్రధాని అనడం దారుణమనీ, ప్రతిపక్షాలు రైతుల డిమాండ్లు లేవనెత్తాయనీ, ప్రధానికి రైతుల పట్ల గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బిల్లు-2021, విద్యుత్ సవరణల బిల్లు-2021ను వర్షాకాల సమావేశాల్లో ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లెజిస్లేటివ్ బిజినెస్ కింద జాబితా చేసిందని ఎస్కేఎం నేతలు తెలిపారు. అయితే ఈ రెండింటిపైన రైతులకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. వాటిని ఉపసంహరించుకునేందుకు 2020 డిసెంబర్ 30న రైతులతో జరిగిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎస్కేఎం నేతలు గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఆ రెండు బిల్లులను ఎలా ప్రవేశపెడుతుందని ప్రశ్నించారు.