Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఆర్సీ తర్వాత స్తంభించిన ఆధార్ బయోమెట్రిక్
- సామాజిక, సంక్షేమ పథకాలకు 27లక్షల మంది దూరం
న్యూఢిల్లీ : అసోంలో 27లక్షల మందికిపైగా పౌరుల ఆధార్ బయోమెట్రిక్ స్తంభించిపోవటం అక్కడ రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో జాతీయ పౌర జాబితా(ఎన్సార్సీ) తుది జాబితా విడుదల(ఆగస్టు 2019లో) చేశాక 27,43,396 మంది ఆధార్ బయోమెట్రిక్‌లను కేంద్రం స్తంభింపజేసింది. ఈ విషయం రాష్ట్ర మంత్రి రంజిత్ కుమార్ దాస్ అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రమంత్రి వెల్లడించిన సమాచారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలన రేపుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో పౌరుల ఆధార్ సంఖ్యలను స్తంభింపజేయటంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాదిమంది పౌరులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, రేషన్ సరుకులు, నగదు బదిలీ, వంటగ్యాస్ సబ్సిడీ..మొదలైనవి అందుకోలేకపోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై కేంద్రం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నార్సీ ముసాయిదా ప్రతిని కేంద్రం విడుదల (జులై 2018లో)చేసినప్పుడు లక్షలాది మందిని భారత్‌లో అక్రమ వలసదారులుగా పేర్కొంటూ జాబితాను విడుదల చేశారు. దీనిపై పౌరుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు రాగా, వారి ఆధార్ సంఖ్య ఆధారంగా మళ్లీ బయోమెట్రిక్ పరిశీలన జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 2019లో తుది ఎన్నార్సీ విడుదలచేశారు. ఈ జాబితా ప్రకారం 19,06,657మందిని అక్రమ వలసదారులుగా పేర్కొన్నారు. 27,43,396 మంది ఆధార్ కార్డులను స్తంభింపజేశారని ఆ రాష్ట్ర మంత్రి దాస్ చెప్పారు. స్తంభించిన ఆధార్ కార్డుదారుల్లో అక్రమ వలసదారులుగా ముద్రపడిన 19 లక్షలమంది కూడా ఉన్నారని చెప్పారు.
దాంతో అసోంలో ఎన్నార్సీ ప్రక్రియపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతోమంది అమాయక పౌరులు ఎన్నార్సీ వల్ల భారత పౌరసత్వానికి దూరమయ్యారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధార్ వంటి బలమైన గుర్తింపు కార్డు ఉన్నా..లక్షలాది మంది పౌరులను అక్రమ వలసదారులగా ఎలా పేర్కొంటారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. దీనిపై కేంద్రంలోని మోడీ సర్కార్, రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ సభ్యుడు, ఎమ్మెల్యే అష్రాఫుల్ హుస్సేన్ మాట్లా డుతూ, ''రాష్ట్రమంత్రి దాస్ పౌరుల ఆధార్ సమా చారం గురించి కీలక విషయాలు బయటపెట్టారు. పౌరులకు ఇచ్చిన ఆధార్ కార్డులకు విలువ ఉందా? లేదా? అన్నది కేంద్రం తేల్చాలి. 27లక్షల మందికి పైగా పౌరుల ఆధార్ కార్డుల్ని స్తంభింపజేశారు. ఈ దేశ పౌరుడినేనని నిరూపించుకునే ఆధార్ కార్డు ఉన్నా ఎంతోమందిని అక్రమ వలసదారు లంటూ జాబితా రూపొందించారు'' అని ఆయన అన్నారు.