Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ఉద్యమకారులపై నిఘా
- ఇజ్రాయిల్ మాల్వేర్ను వినియోగిస్తున్న దేశాల్లో భారత్
- అంతర్జాతీయ మీడియా సంస్థల దర్యాప్తులో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ ఫోన్ హ్యాకింగ్ కలకలం చెలరేగింది. ఇజ్రాయిల్‌లోని ఎన్ఎస్ఒ గ్రూప్ కంపెనీకి చెందిన 'పెగాసస్' అనే స్పైవేర్‌పై ప్రస్తుతం తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ స్పైవేర్ సాయంతో భారత్‌లోని పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులకు చెందిన దాదాపు 300 మంది ఫోన్లు హ్యాంకింగ్‌కు గురైనట్లు 'ది వైర్' సంచాలనాత్మక కథనం వెల్లడించింది. ఇదే సమయంలో జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల, ఉద్యమకారులపై నిఘా ఉంచేందుకు ఈ స్పైవేర్‌ను వినియోగిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉందని ఒక దర్యాప్తులో తేలిందని పేర్కొంటూ ది వాషింగ్టన్ పోస్టు, దా గార్డియన్, లేమోండేతో సహా 17 మీడియా సంస్థలు చేసిన దర్యాప్తులో తేలింది. ఈ దర్యాప్తు వివరాలు ఆదివారం వెల్లడయ్యాయి. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలకు చెందిన 37 స్మార్ట్ఫోన్లు హ్యాకింగ్‌కు గురవడమో లేదా ప్రయత్నాలు జరగడమో అయ్యాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018-19 మధ్య దేశంలోని దాదాపు 300 మంది లక్ష్యంగా హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయని 'ది వైర్' వెల్లడించిన కథనం దీనికి మరింత బలం చేకూరుతోంది. ఈ జాబితాలో ది హిందూ, హిందుస్తాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి మీడియా సంస్థలకు చెందిన 40 మంది భారతీయ జరల్నిస్టులు, ది వైర్‌కు చెందిన ఇద్దరు వ్యవస్థాపక ఎడిటర్ల పేర్లు ఉన్నాయి.
అయితే పౌరులపై నిఘా ఉంచేందుకు మాల్వేర్ను ఉపయోగించారన్న వార్తలను భారత ప్రభుత్వం 2019లో ఖండించింది. సైబర్ గూఢచర్యం కోసం ఇజ్రాయిల్ ఎన్ఎస్ఒ సంస్థ తమ మెసేజింగ్ ఫ్లాట్‌ఫాంను వినియోగించుకుంటోందని ఆరోపిస్తూ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ అమెరికాలో దావా దాఖలు చేసిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చింది. యుఎఇలో అసమ్మతివాదులపై నిఘా ఉంచేందుకు పెగాసస్ సాయం చేసిందని పరిశోధకులు ఆరోపణలు చేసిన నాటి నుంచి ఇజ్రాయిల్‌కు చెందిన ఈ ఎన్ఎస్ఒ సంస్థ వార్తల్లో ఉంది. 2018లో టర్కీలోని సౌదీ దౌత్యకార్యాలయంలో హత్యకు గురైన ప్రముఖ కాలమిస్టు జమల్ ఖసోగ్గికి సన్నిహితంగా ఉండే ఇద్దరు మహిళల ఫోన్లను టార్గెట్ చేసుకునేందుకు కూడా పెగాసస్ వినియోగం జరిగిందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. ఈ జాబితాను ఫ్రాన్స్‌కు చెందిన ఫర్బిడెన్ స్టోరీస్ అనే జర్నలిజం సంస్థ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వార్తాసంస్థలతో పంచుకున్నాయని పేర్కొంది. హ్యాకింగ్ టార్గెట్‌కు సంబంధించిన డేటాబేస్‌లో 50 వేలకు పైగా ఫోన్ నంబర్లు ఉండగా, ఇప్పటి వరకు వెయ్యి మంది ఫోన్ నంబర్లను మాత్రమే గుర్తించగలిగారు. భారత్, మెక్సికో, బహ్రెయిన్ సౌదీ అరేబియా, అజర్బైజాన్, హంగేరీ, కజకిస్తాన్, మొరాకో, రువాండా, యుఎఇతో సహా దాదాపు 50 దేశాలకు చెందిన వ్యక్తుల ఫోన్ నంబర్లు ఇందులో ఉన్నాయి. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 189 మంది జర్నలిస్టులు, 600మందికి పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, 65 మంది వ్యాపార ఎగ్జిక్యూటివ్‌లు, 85 మంది మానవహక్కుల కార్యకర్తలు ఉన్నారు.
మెసేజ్‌లు, ఫొటోలు, ఈమెయిళ్లు, రికార్డయిన కాల్స్, ఇతరత్రా వంటి వాటని ఫోన్లలో మాల్వేర్ ప్రవేశం ద్వారా దొంగలించేందుకు ఈ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని ది గార్డియన్ పేర్కొంది. =వాల్‌స్ట్రీట్ జర్నల్, సిఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ఆల్జజీరా, ఫ్రాన్స్24, మీడియా పార్ట్, బ్లూంబర్గ్, రాయిటర్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల ఫోన్ నంబర్లు జాబితాలో ఉన్నాయని తెలిపింది. ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా భయం, హాని కలుగకుండా విధులు నిర్వర్తించేందుకు జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని మీడియా సంస్థల అధినేతలు పేర్కొంటున్నారు.
లిస్ట్‌లో ఇద్దరు కేంద్ర మంంత్రులు, రాహుల్ పేర్లు
తీవ్ర దుమారం రేపుతున్న హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'పెగాసస్' లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో కీలక నేతలు, ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ పటేల్, కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ సిఇసి అశోక్ లావాసా ఫోన్ నంబర్లు హ్యాకింగ్ టార్గెట్ జాబితాలో ఉన్నట్టు 'ది వైర్' తాజాగా మరో కథనం వెల్లడించింది. వీరితో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ప్రశాంత్ కిషోర్ సన్నిహితుల ఫోన్ నంబర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. రాహుల్ గాంధీ ఉపయోగించిన కనీసం రెండు ఫోన్ నంబర్లు ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. 2018-19 సమయంలో ఆయన ఫోన్లను టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలిపింది. 2017లో నిఘాకు గురయ్యారని భావిస్తున్న ప్రస్తుత కేంద్ర ఐటి మంత్రి అశ్విని వైష్టవ్ ఆ సమయంలో మంత్రి కాదు, ఎంపి కాదు, అప్పుడు బిజెపి సభ్యుడి కూడా లేరు. ఇప్పుడు అదే మంత్రి హ్యాకింగ్‌పై వస్తున్న కథనాలను ఖండించారు. ఈ కథనాలకు ఎటువంటి ఆధారాలు లేదని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇలాంటి వార్తలు రావడం కాకతాళీయం కాదని అన్నారు.
మోడీపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్
ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. దేశ భద్రతను పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని విమర్శించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆ పదవి నుంచి వెంటనే తప్పించాలని, పెగాసస్ వ్యవహారంలో ప్రధాని మోడీ పాత్రను నిగ్గుతేల్చేందుకు విచారణ చేయాలని డిమాండ్ చేసింది. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ పెగాసస్ వ్యవహారంపై కేంద్ర బాధ్యత వహించాలన్నారు. ఈ అంశంపై ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా చర్చించి జ్యుడిషియల్ లేదా పార్లమెంటరీ విచారణ డిమాండ్‌పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అమిత్‌షా వెంటనే రాజీనామా చేయాలని రాజ్యసభ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.