Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలపై నిఘా విధించడంపై
- బీజేపీ సర్కార్ సమాధానం చెప్పాల్సిందే.. సీపీఐ(ఎం) డిమాండ్
న్యూఢిల్లీ : భారతీయులపై అక్రమంగా నిఘా పెట్టే అధికారం ఎవరిచ్చారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై బీజేపీ ప్రభుత్వం తప్పక సమాధానం చెప్పాల్సి వున్నదని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సైబర్ నిఘాపై ప్రపంచంలోనే అగ్ర స్థానంలో వున్న ఇజ్రాయిల్ సంస్థ ఎన్ఎస్ఓ నుంచి పెగాసస్ స్పైవేర్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందన్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ''తీవ్రంగా పరిశీలించే, సమీక్షించే ప్రభుత్వాలతోనే'' వ్యవహారం నెరుపుతామని ఎన్ఎస్ఓ స్పష్టమైన వివరణ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా కోసం, వారి స్మార్ట్ ఫోన్లను హ్యాకింగ్ చేయడానికి లక్ష్యం చేసుకున్నట్టు దర్యాప్తుల్లో వెల్లడైంది. తమ పౌరులపై నిఘా పెట్టే దేశాల్లో, అలాగే ఎన్ఎస్ఓ క్లయింట్లుగా వున్న దేశాల్లో ఇటువంటి ఘటనలు 50వేలకు పైగా వున్నట్టు తెలుస్తోంది. ఆ సంస్థ ప్రస్తావించిన దేశాల్లో భారత్ కూడా వుంది. ర్వాండా, మొరాకో, సౌదీ అరేబియా, యూఈఏ, మెక్సికో వంటి దేశాలు ఆ జాబితాలో వున్నాయి. ''భారత్‌లో, వందలాదిమంది జర్నలిస్టులు, కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వ అధికారులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లకు చెందిన ఫోన్ నెంబర్లు నిఘా జాబితాలో వున్నాయని'' ఆ నివేదిక పేర్కొంది. పెగాసస్ నిఘా నీడలో దాదాపు 40మంది జర్నలిస్టులు వున్నారని భారత మీడియా వార్తలు పేర్కొన్నాయి. రెండేండ్ల కిందటే సీపీఐ(ఎం) ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవదీసింది. ప్రమాదకరమైన ఈ స్పైవేర్‌ను భారత్‌లో కూడా వాడుతున్నారనీ, వాట్సాప్ ద్వారా ఇది వెల్లడైందని తెలిపింది. ఎన్ఎస్ఓ సేవలను పొందుతున్నామని మోడీ ప్రభుత్వం స్పష్టంగా తిరస్కరించలేదు. అయితే, ఎలాంటి అనధికార నిఘా లేదని మాత్రం చెప్పింది. ఈ ప్రకటనలతో ఈ ప్రభుత్వం తన ప్రజలపై ఎన్ఎస్ఓతో ఇటువంటి నిఘా కార్యకలాపాల కోసం కలిసి పని చేస్తోందని స్పష్టమైందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఎన్ఎస్ఓతో తన కార్యకలాపాలేంటనే విషయమై కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇందుకోసం వున్న నియమ నిబంధనలేమిటి? మన ప్రజా నిధులను దీనికోసం ఎంత మొత్తం చెల్లించారు? వంటి విషయాలు వెల్లడించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.
స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేయడానికి సైబర్ స్పై సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వాలైనా సరే ఉపయోగించడం భారత చట్టాల ప్రకారం నిషిద్ధం. ఏ చట్టం కింద ప్రజలపై ఇటువంటి నిఘా కార్యకలాపాలను ప్రభుత్వం చేపట్టింది? సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం గోప్యతా హక్కు అనేది ప్రాథమిక హక్కు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం గోప్యతా చట్టాన్ని శాసిస్తోంది. గతంలో మానవ హక్కుల కార్యకర్తలకు చెందిన స్మార్ట్ ఫోన్లు, వారి కంప్యూటర్లను హ్యాకింగ్ చేసిన ఘటనలు వెలుగు చూశాయి. వారి కంప్యూటర్లలో డిజిటల్ రీతిలో కొన్ని పరికరాలు పెట్టారు. ఆ తర్వాత నిరంకుశ చట్టాల కింద వారి అరెస్టులకు వాటిని ఉపయోగించారు. ఫాసిస్ట్ పద్ధతులను ఉపయోగించే ఈ నిరంకుశవాదం పూర్తిగా అనామోదయోగ్యమైందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ''నిఘా పెట్టడం, అరెస్టు చేయడం'' అనే సూత్రం భారత పౌరుల ప్రాధమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది.
అక్రమమైన రీతుల్లో, అనధికారికంగా భారత ప్రజలపై నిఘా కోసం పెగాసస్ సైబర్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, తన నిజాయితీని నిరూపించుకోవాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.