Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలుష్య కారక ఇంధన వినియోగం ఎక్కువ
- దక్షిణాది రాష్ట్రాలు బెటర్ : ఎన్ఎఫ్హెచ్ఎస్
న్యూఢిల్లీ : దేశంలో ఎల్పీజీ వినియోగం తక్కువగా ఉన్నది. గ్రామీణ భారతంలోని దాదాపు సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో గ్యాస్‌ను తక్కువగా వినియోగిస్తున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద దేశంలోని మహిళలందరికీ ఎల్పీజీ సౌకర్యాన్ని కల్పించి అనుకున్న లక్ష్యాన్ని సాధించామని మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న విషయం విదితమే. కానీ, సాక్షాత్తూ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే ఎల్పీజీ వినియోగం తక్కువగా ఉండటం క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నది. గుజరాత్ సహా బీహార్, హిమాచల్‌ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ పరిస్థితే ఉన్నది. కేంద్ర గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది.
ఈ సర్వే సమాచారం ప్రకారం.. ఈ ఐదు రాష్ట్రాల్లోని 50 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన ఇంధన వినియోగం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది తమ వద్ద ఎల్పీజీ సౌకర్యం ఉన్నప్పటికీ దానిని ఉపయోగించడం లేదు. పశ్చిమ బెంగాల్లో 20.5 శాతం మంది మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లను కలిగి ఉన్నారు. బీహార్‌లో 30.3శాతం మంది మాత్రమే శుద్ధమైన ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. ఇక శుద్ధమైన ఇంధన వినియోగం అసోంలో 33.7 శాతంగా, మేఘాలయలో 21.7 శాతంగా ఉన్నది. హిమాచల్‌ప్రదేశ్‌లో కేవలం 44.5 శాతం గ్రామీణ ప్రాంతాల్లోని ఇండ్లలో ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని 46.1 శాతం ఇండ్లలో మాత్రమే దీని వినియోగం ఉండటం గమనార్హం. ఇక మణిపూర్ (64.4 శాతం), సిక్కిం (60.7శాతం) రాష్ట్రాలు పర్వాలేదనిపించాయి.
ఇక గ్యాస్ వినియోగంలో దేశంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా బెటర్‌గా ఉన్నాయి. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాలలోని 70 నుంచి 80 శాతం ఇండ్లలో ఎల్పీజీ వినియోగం ఉన్నది. తెలంగాణ (88.3శాతం), ఆంధ్రప్రదేశ్ (77.9 శాతం), కర్నాటక (69.3 శాతం), కేరళ (66.3శాతం)లు చక్కటి ప్రదర్శనను కనబర్చాయి.
కాగా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2016, మే 1న పీఎంయూవైను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలో 8 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్స్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2019 సెప్టెంబర్ నాటికి లక్ష్యం సాధించినప్పటికీ ఎల్పీజీ వినియోగం దేశంలో తక్కువగా ఉండటం గమనార్హం. అంతేకాకుండా, కాలుష్య కారక ఇంధన వినియోగం పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలనీ, ఇందుకు క్షేత్రస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు.