Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర సంక్షోభంలోనూ భారీగా ప్రకటనలు
- సొంత రాష్ట్రంలోనే కాదు... దేశ రాజధానిలోనూ హౌర్డింగులు
- మోడీ, అమిత్‌షా కన్నుల్లోపడటానికే : రాజకీయవిశ్లేషకులు
కరోనా విజృంభించాక.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్రం ఆర్థిక భారాలు మోపుతున్నది. పెట్రో, గ్యాస్ ధరల్ని బాది ఖజానాను నింపుకుంటున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే జరుగుతున్నది. ఓ పక్క కాసులు లేవని చెబుతూనే.. మరోపక్క ప్రచారాలకు కమలంపార్టీ ముఖ్యమంత్రులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సొంత రాష్ట్రాల్లో కోట్లు విలువ చేసే ప్రకటనలు.. హౌర్డింగులు పెడుతున్నారు. అంతటితో ఆపకుండా రాష్ట్రాలు దాటి దేశరాజధాని ఢిల్లీలోనూ మెట్రో పిల్లర్లపై హౌర్డింగులను, ప్రకటనలను గుమ్మరిస్తున్నారు. మోడీ, అమిత్‌షా కనుసన్నల్లో పడి.. వారి మెహర్బానీ దక్కితే చాలన్నట్టుగా భావిస్తున్నట్టున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, విజయాలను ప్రచారం చేసుకుంటుంటాయి. దీనికోసం వార్తపత్రికలు, టెలివిజన్, సోషల్ మీడియా, పోస్టర్లు, హౌర్డింగ్‌లను ఉపయోగించుకుంటాయి. ఈ విషయంలో ఏ ప్రభుత్వమూ మినహాయింపు కాదు. అయితే కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్.. గత ప్రభుత్వాలను మించి ప్రకటనలు గుమ్మరిస్తున్నది. పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా పాత పథకాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నా.. ఆచరణలో ఎంతగా విఫలమవు తున్నాయో అందరికి తెలిసిందే. ఏడేండ్ల కాలంలో మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో సగానికి పైగా అటకెక్కాయని సర్కారు నివేదికలే ధ్రువీకరిస్తున్నాయి. కేంద్రం తీరు ఇలా ఉంటే.. మేం తక్కువ కాదన్నట్టుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. కమలం పార్టీ అధికారం లో ఉన్న రాష్ట్రాలు ప్రచారానికి ఏమాత్రం వెనుకడుగు వేయటంలేదు. పైగా తమ సొంత రాష్ట్రంల్లో ప్రచారాలు, హౌర్డింగ్ల ఏర్పాటువరకే పరిమితం కావటంలేదు. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకటనలకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలన్నీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ.. భారీ అప్పుల భారాలు పడుతున్నప్పుడు ఇలాంటి ప్రకటనలు ఇవ్వటం చర్చనీయాంశంగా మారుతున్నది. ఇంధన,పెట్రో ధరలతో పాటు మరెన్నో పన్నులతో కేంద్రం నిలువుదోపిడీకి పాల్పడుతుంటే.. రాష్ట్రాలు పాత పన్నుల సవరణలనో.. మరొకటనో భారాలు మోపుతున్నాయి. ప్రజా నిధులను ప్రజాశ్రేయస్సుకు వినియోగించకుండా ప్రకటనలు చేయటమేంటని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
యోగి ఇమేజ్ పెంచుకోవటానికి..
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. అక్కడ చేసిన అభివృద్ధి అంతంతే నని ప్రతిపక్షాలు, పౌరసమాజం చెబుతూనే ఉన్నాయి. కానీ యోగి సర్కార్ మాత్రం ఎన్నికల్లో ఓటర్లను మాయచేసేలా.. విదేశీ వార్తాపత్రికలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రకటనలిచ్చారు. దక్షిణ, పశ్చిమ భారత్ అనే తేడాలేకుండా ప్రకటనల ద్వారా యోగి ప్రచారం చేసుకుంటున్నారు.
గతేడాది మార్చినెలలో.. తన ప్రభుత్వం తన పదవీకాలాన్ని నాలుగేండ్లు పూర్తిచేసినపుడు విదేశీ మీడియాలో ప్రకటనలిచ్చింది యోగిసర్కార్. తమ ప్రభుత్వం సాధించిన విజయాలంటూ... మూడు పేజీల ప్రకటనలిచ్చారు. అమెరికా పత్రిక 'టైమ్' లో పబ్లిసిటీకింద ముద్రించింది. దేశవ్యాప్తంగా వివిధ భాషలలోని వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానెళ్లలోనూ ప్రకటనలు హౌరెత్తించింది. ఢిల్లీ కూడా యోగి హౌర్డింగ్‌లు, బ్యానర్లు, పోస్టర్లతో నిండిపోయింది.
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగి ప్రభుత్వం ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రచార ప్రకటనల్లో దేశంలోనే యూపీ ప్రథమ స్థానంలో ఉన్నదని అధికారులు ధ్రువీకరించారు. ఢిల్లీలోని ప్రతి సందులోనూ ఎక్కడో చోట హౌర్డింగులు కనిపిస్తున్నాయి. 'ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్, ఉచిత చికిత్స' , 'నాలుగు లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు' అని పేర్కొన్న హౌర్డింగ్‌లు కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేసుకుంటున్నది .
ఇక్కడే కాదు.. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్, పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మొదలైన సరిహద్దుల వరకు వేలాది హౌర్డింగ్లే దర్శన మిస్తున్నాయి. ఇవన్నీ హిందీ మాట్లాడే రాష్ట్రాలు, అయితే ఉత్తర భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లో, దక్షిణ భారత దేశంలోని కర్నాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ఇంగ్లీషులలో ఈ హౌర్డింగ్ల ద్వారా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రచారం చేయటం నిధుల దుబారా అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల బెంగళూరులో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని ఉన్న హౌర్డింగ్ను విమానాశ్రయం నుంచి నగరానికి వెళ్లే మార్గంలో ఉంచినట్టు తెలిసింది. ఆ ఫోటో , వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక.. అక్కడ ఏర్పాటుచేసిన హౌర్డింగ్ తొలగించారు.
ఓ వైపు యోగి హౌర్డింగులు ఢిల్లీని ఆక్రమిస్తే..ఆప్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా హౌర్డింగులను ఏర్పాటు చేశారు. 'టీకా వ్యవస్థాపించబడిందా?' అని ప్రజలను అడుగుతున్నారు. ఇది బీజేపీ నేతలకు మింగుడుపడటంలేదు.
మేమూ పోటీలోనే..
బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్నాటక, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కూడా ప్రకటనల్లో వెనుకబడి లేవు. దక్షిణ భారత్ నుంచి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, ఆంగ్ల వార్తాపత్రికలకు కర్నాటక ప్రభుత్వం పూర్తి పేజీ ప్రకటనలను ఇచ్చింది. 'అందరికీ వ్యాక్సిన్, ఉచిత వ్యాక్సిన్, థాంక్స్ మోడీ జీ' అనే నినాదంతో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ప్రధాని మోడీతో యాడ్స్ ఇచ్చింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్రలోనే కాదు. ప్రధాని సొంతరాష్ట్రమైన గుజరాత్ నుంచి ప్రచురించే ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, మరాఠీ వార్తాపత్రికలకూ యడియూరప్ప సర్కార్ ప్రకటనలిచ్చింది.
అలానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని మోడీ చిత్రాలతో ఉన్న యాడ్స్ ఢిల్లీలోని ఆంగ్ల వార్తాపత్రికలతో పాటు వివిధ రాష్ట్రాల స్థానిక భాషలల్లోనూ వార్తాపత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. ఇది కాకుండా, ఈ ప్రకటనల హౌర్డింగ్‌లు, బ్యానర్లు, పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉంచారు. ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఆర్థిక కష్టాలున్నా.. యూపీ,మధ్యప్రదేశ్, కర్నాటక అంతలా ప్రకటనలు ఇవ్వకపోయినా..ఢిల్లీ నుంచి ప్రచురించే హిందీ,ఆంగ్ల వార్తాపత్రికలు ప్రకటనలు ఇవ్వటం గమనార్హం.
వాస్తవికతకు దూరం..
ఆయా రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రకటనలివ్వటం సర్వసాధారణం. కానీ ఉచిత వ్యాక్సిన్ ప్రచారం చేస్తూ.. ప్రధాని మోడీకి బీజేపీ పాలిత రాష్ట్రాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. వాస్తవానికి యూపీ, మధ్యప్రదేశ్ ,ఉత్తరాఖండ్‌లో వ్యాక్సిన్ల కొరత ఉన్నది. టీకా వేయించుకోవటానికి జనం పడిగాపులు పడుతున్నారు. అంతేకాదు కరోనా తీవ్రత, పరీక్షలను పరిశీలించినట్లయితే.. ఇతర రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రాల్లో ఘోరంగా ఉన్నది. కరోనా రెండు సార్లు విజృంభించాక.. ఎంతగా ఆరోగ్యసేవలు దిగజారాయో..ఎంతమంది చనిపోయారో..ప్రజలకు విదితమే. వాస్తవికతకు దూరంగా నిస్సిగ్గుగా ప్రచారాలు చేసుకోవటమేం టనీ స్థానికులు బీజేపీ పాలకులను తూర్పారబడుతున్నారు.