Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో 1.19 లక్షలక పైనే..
- ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. నిత్యం లక్షలాది మంది వైరస్ బారినపడుతుండటంతో పాటు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో పెద్ద దిక్కులేకుండా చిన్నారులను అనథలను చేస్తోంది ఈ కరోనా మహమ్మారి. దీంతో లక్షల మంది చిన్నారులు దిక్కులేనివారవుతున్నారని తాజాగా ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15లక్షల మందికి పైనే చిన్నారులు తమ తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయినట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇక భారత్లో ఏకంగా 1.19 లక్షల మందికి పైగా చిన్నారులు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయారని దిగ్భ్రాంతికర విషయాలను లాన్సెట్ నివేదిక తెలిపింది. గతేడాది మార్చి నుంచి 2021 ఏప్రిల్ వరకు 14 నెలల సమయంలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 15,62,000 మంది చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకులలో కనీసం ఒకరిని కోల్పోయినట్టు నివేదిక పేర్కొంది. ఇందులో 10,42,000 మంది తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరినీ కోల్పోయినట్టు తెలిపింది. తల్లుల కంటే నాన్నలను కోల్పోయిన చిన్నారులు ఐదు రెట్లు అధికంగా ఉన్నారని నివేదిక తెలిపింది. భారత్, బ్రెజిల్, అమెరికా దేశాల్లో ఈ సంఖ్య లక్షకు పైనే ఉండగా.. అత్యధికంగా మెక్సికోలో 1.41లక్షల మంది చిన్నారులు తమ తల్లిదంద్రులు లేదా సంరక్షకులను కోల్పోయారు. భారత్లో మొత్తం 1,19,000 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో ఒకరిని కోల్పోయారు. ఇందులో 1.16 లక్షల మందికి అమ్మనాన్నల్లో ఒకరు లేదా ఇద్దరినీ కరోనా మహమ్మారి దూరం చేసిందని నివేదిక పేర్కొంది. 25,500 మంది పిల్లలు తల్లులను, 90,751 మంది చిన్నారులు తండ్రులను కోల్పోయారు.