Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
- ప్రభుత్వ నాల్గో సెరో సర్వేలో ఆసక్తికర విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. త్వరలోనే థర్డ్‌వేవ్ ముప్పు పొంచివున్నదనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. థర్డ్‌వేవ్ అంచనాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణాలకు సంబంధించి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకమని పేర్కొంది. పూర్తి టీకాలు తీసుకోకుండా ప్రయాణించకుండా ఉండాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభం నుంచి అనేక రాష్ట్రాలు ఆంక్షలను సడలించడం ప్రారంభించాయి. ఈ కారణంగా, పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు రద్దీగా మారుతున్నాయి. దీని వల్ల వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని తెలిపింది. రెండు డోసులు తీసుకున్న వారు మాత్రమే ప్రయాణాలు చేయాలని సూచించింది. తాజా సెరో సర్వే ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండకూడదని తెలిపింది. స్థానిక లేదా జిల్లా స్థాయిలో కరోనా పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు అంటూ సెరో అంశాలను ప్రస్తావించింది. అలాగే, కరోనా నుండి జనాభాలో ఎంత శాతం ప్రజలు రక్షణ పొందగలిగారో తెలుసుకోవడానికి రాష్ట్రాలు స్థానిక సెరో-సర్వేలను నిర్వహించాలని తెలిపింది. భవిష్యత్తులో సంక్రమణ వేవ్‌లు రావచ్చని పేర్కొంటూనే... పలు రాష్ట్రాల్లో కరోనా నిరోధక శక్తి అధిక స్థాయిలో ఉండగా, పలు ప్రాంతాల్లో అత్యల్పంగా ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశాలను నివారించాల్సిన అవసరముందని పేర్కొంది.
ప్రాథమిక పాఠశాలలు తెరవవచ్చు: ఐసీఎంఆర్ చీఫ్
పాఠశాలలను తెరవవచ్చుననీ, ఎందుకంటే చిన్నపిల్లలలో సంక్రమణ ప్రమాదం పెద్దల కంటే తక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. ప్రాథమిక పాఠశాలలను ప్రారంభ దశలో ప్రారంభించాలనీ, ఆ తరువాత మాధ్యమిక పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సూచించారు. దీనికి ముందు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి టీకాలు వేయాలని పేర్కొన్నారు.
నాల్గో సెరో సర్వే
అలాగే, ప్రభుత్వం నాల్గో సెరో సర్వే వివరాలను వెల్లడిస్తూ.. కరోనాకు వ్యతిరేకంగా 67.6 శాతం మంది ప్రజలు కరోనా యాంటీబాడీలను అభివృద్ధి చేసుకోగలిగారని తెలిపింది. సెరో సర్వేలో ప్రస్తావించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోవిడ్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు 69.2 శాతం స్త్రీలలో, 65.8 శాతం పురుషులలో కనుగొన్నారు. పట్టణ ప్రాంతాల్లో 69.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 66.7 శాతం మందిలో ప్రతిరోధకాలు ఉన్నాయి. ఇక 6-9 సంవత్సరాల వయస్సు వారిలో 57.2 శాతం, 10-17 ఏండ్ల వారిలో 61.6 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించారు. అలాగే, 18-44 ఏండ్ల వారిలో 66.7 శాతం, 45-60 ఏండ్ల వారిలో 77.6 శాతం, 60ఏండ్లకు పైబడినవారిలో 76.7 శాతం మందిలో కరోనా ప్రతిరోధకాలు గుర్తించబడ్డాయి.