Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెగాసస్ ప్రాజెక్టు డేటాతో ఏకీభవిస్తున్నామని వెల్లడి
న్యూఢిల్లీ : పెగాసస్ ప్రాజెక్టు డేటాకు పూర్తిగా కట్టుబడి వున్నామని, పెగాసస్ స్పైవేర్ లక్ష్యాలుగా వున్న వారికి ఈ డేటాకు సంబంధం వుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది. పెగాసస్ ప్రాజెక్టులో పేర్కొన్న జర్నలిస్టులు, కార్యకర్తలు, ఇతరులను అక్రమంగా లక్ష్యం చేసుకోవడం నుండి అందరి దృష్టి పక్కకు మళ్ళించడానికే ఈ పుకార్లు ఉద్దేశించబడ్డాయని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక అధికార ప్రకటన జారీ చేసింది. పెగాసస్ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ఆరోపణలను, సరిగ్గా లేని మీడియా కథనాలను ఖండించింది.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇజ్రాయిల్ విభాగం హిబ్రూలో జారీ చేసిన ప్రకటన ఆంగ్లా సారాంశాన్ని త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. కాగా, ఈ ప్రకటనకు తప్పుగా బాష్యం చెబుతూ కొన్ని వెబ్సైట్లు ఇస్తున్న వార్తా కధనాలను అమ్నెస్టీ ఖండించింది. కాగా, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయడానికి మోడీ ప్రభుత్వం వాటిని ఉపయోగించుకుంటోంది. దీనిపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇజ్రాయిల్ ప్రతినిధి గిల్ నవేను వైర్ ప్రశ్నించింది. ఇజ్రాయిలో మీడియాలో ఒక వర్గం హిబ్రూ ప్రకటనకు తప్పుగా భాష్యం చెప్పాయని ఆయన అంగీకరించారు. ఇంగ్లీషులో తప్పుగా ప్రస్తావించారని అన్నారు. ఈ ప్రాజెక్టులో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా భాగస్వామిగా వుంది. డేటాబేస్‌పై పనిచేసే 67మంది ఫోన్లపై అమ్నెస్టీ టెక్నికల్ ల్యాబ్ ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించింది. వాటిలో 37 ఫోన్లు పెగాసస్ హ్యాక్‌కు గురయ్యాయని వెల్లడైంది.