Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణానికి గుజరాత్ సర్కారు యత్నం
- భూములు కాపాడుకునేందుకు గ్రామస్థుల నిరసనలు
అహ్మదాబాద్ : మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వల్సాడ్‌లో మరో వివాదం రాజుకున్నది. ఇక్కడ వివాదాస్పద పోర్టు నిర్మాణానికి గుజరాత్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు ఇప్పటికే గ్లోబల్ బిడ్లకు గ్రీన్‌సిగల్ ఇచ్చింది. అయితే, దీనిపై తీర గ్రామం నర్గోల్కు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోర్టు నిర్మాణంతో తాము భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనీ, జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా నర్గోల్ గ్రామస్థులు మరోసారి నిరసనలకు దిగారు.ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ)కు ప్రత్యామ్నాయంగా నర్గోల్లో పోర్టు ఉపయోగపడుతుందని గుజరాత్ ప్రభుత్వం వాదన. ప్రస్తుతం జేఎన్పీటీ పూర్తి కెపాసిటీతో నడుస్తున్నదని వివరించింది. వివాదాస్పద నర్గోల్ పోర్టు నిర్మాణానికి విజరురూపానీ సర్కారు ఇప్పటికే ముందడుగు వేసింది. ఈ మేరకు రూ. 3800 కోట్ల విలువ చేసే గ్లోబల్ బిడ్ల కోసం గుజరాత్ మెరిటైమ్ బోర్డు (జీఎంబీ)కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. కాగా, వల్సాడ్‌లో పోర్టు అభివృద్ధి కోసం గుజరాత్ ప్రభుత్వం 1997 నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. అప్పటి నుంచే ఇక్కడి స్థానికులు పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తున్నారు. వల్సాడ్‌లోని నర్గోల్ గ్రామం..
మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి 140 కిలోమీటర్లు, గుజరాత్‌లోని కీలక ప్రాంతం సూరత్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.అయితే, పోర్టు నిర్మాణంపై స్థానికుల్లో ఆందోళన రేకెత్తుతున్నది. పోర్టు నిర్మాణానికి ఎంచుకున్న ఈ భూమి సారవంతమైనదనీ, ఇందులో పండ్ల తోటలకు అనువైనవని వారు తెలిపారు. ఇదే తమ జీవనోపాధి అనీ, ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే తాము అది కాస్తా కోల్పోయే ప్రమాదమున్నదని గ్రామస్థులు చెప్పారు. ఇప్పటికే నర్గోల్ గ్రామ పంచాయతీ గత నెలలో జనరల్ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది.
పోర్టు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఇందులో ఒక తీర్మానాన్ని సైతం ఆమోదించారు. '' నర్గోల్ గ్రామంలో దాదాపు 16వేల జనాభా ఉంటుంది. ఇందులో సగం జనాభా చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి ఉన్నది. అయితే, ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం జరిగితే తమ వృత్తిపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని మత్స్యకారులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు'' అని నర్గోల్ గ్రామ మాజీ సర్పంచ్ యతిన్ భండారీ తెలిపారు. పోర్టు నిర్మాణం విషయంలో ఏ ఒక్క అధికారి కూడా తమను సంప్రదించలేదని అన్నారు. ఇప్పటికీ పునరావాసం విషయంలో తమకు ఎలాంటి స్పష్టతా రాలేదని వివరించారు.