Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా సెకండ్‌వేవ్‌లో లోతైన
- క్షేత్రస్థాయి కథనాలు ఇచ్చిన ఆయా సంస్థలు
- ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే మీడియా లక్ష్యంగా దాడులు..
- మోడీ సర్కారుపై ప్రతిపక్షాల మండిపాటు
న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో న్యూస్ ఛానల్ భారత్ సమాచార్‌పై ఐటీ దాడులు జరిగాయి. పన్నులు ఎగవేశా యనే అభియోగాలతో ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో దైనిక్ భాస్కర్‌కు చెందిన 35 ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగాయి. దైనిక్ భాస్కర్ సంస్థ ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారత్ సమాచార్ ఛానల్ పై కూడా ఐటీ దాడులు జరిగాయి. ట్యాక్స్ డాక్యుమెంట్ల కోసం ఈ ఛానల్ ఎడిటర్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, కోవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో.. చాలా దూకుడుగా దైనిక్ భాస్కర్ రిపోర్టింగ్ చేసింది. మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు, వాస్తవాలను ఎత్తిచూపుతూ లోతైన కథనాలను రాసింది. భారత్ సమాచార్ సైతం యూపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, ప్రజా ఇబ్బందులపై కథనాలు ప్రసారం చేసింది. మీడియా సంస్థలపై దాడుల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయిందనే కథనాలను ప్రసారం చేసినందుకే ఈ సంస్థలపై ఐటీ దాడులు చేయించారని ఆరోపించాయి. 'మోడీ ప్రభుత్వ వెర్రి వేషాలు పనిచేయవు. వాస్తవాన్ని తొక్కేసి, భయపట్టేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. గంగలో శవాలు తేలిన విషయాన్ని మోడీ ప్రభుత్వం దాయలేదు. అణచివేతకు కేంద్ర సంస్థలను దుర్వినియోగపర్చడం ఖండించదగినది' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. కరోనా సమయంలో మరణ వార్తలు, మోడీ సర్కార్ గూఢచర్యం అంశాలను బహిర్గతం చేసినందుకు ఐటీ విభాగం దైనిక్ భాస్కర్‌పై సోదాలు చేపట్టిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ అన్నారు. సిగ్గులేని ప్రభుత్వంగా తయారైందనీ, ప్రజాస్వామ్యం, హక్కులను కాలరాయడంలో అత్యయిక పరిస్థితి కంటే ఘోరంగా ఉందని పదునైన విమర్శలు చేశారు.ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు చేపట్టిన దారుణమైన చర్య అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యాని ంచారు. దీనిని తీవ్రంగా ఖండించారు. ఇసుమంత విమర్శలను కూడా ప్రభుత్వం సహించలేకపోతోందని రాజస్థాన్ సీఎం గెహ్లెట్ ట్వీట్ చేశారు. 'బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా... కేంద్రం భరించలేకపోతుందనడానికి ఈ చర్యే నిదర్శనం. ఇది ప్రమాదకరమైన మనస్తత్వం. ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా అందరూ గొంతెత్తాలి. ఇటువంటి దాడులను తక్షణమే నిలిపివేసి.. స్వేచ్ఛాయుతంగా మీడియా తన పని తాను చేసుకునే విధంగా అనుమతించాలి' అంటూ సీఎం కేజ్రీ వాల్ అన్నారు. కరోనాను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టినందుకే దైనిక్ భాస్కర్‌పై ఈ సోదాలు జరిపిందనీ, దీంతో ఆ సంస్థ మూల్యం చెల్లించుకుంటోందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. అరుణ్ శౌరీ చెప్పినట్టు ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితనీ, ఇది సవరించిన అత్యవసర పరిస్థితి అని ట్వీట్ చేశారు.