Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలమయమైన నగరం.. పలు రైలు సర్వీసులకు అంతరాయం
- సీఎం ఉద్ధవ్ అత్యవసర సమావేశం
ముంబయి: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని నదులు పలు చోట్ల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబయిని భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో నగరమంతా జలమయం అయింది. ముంబయి సహా రాష్ట్రంలోని పలు జిల్లాలలో వరుసగా ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి. థానే, పాల్గర్, కొంకణ్, రత్నగిరి, కొల్హాపూర్,పూణే తదితర జిల్లాల్లో రైలు, రోడ్డు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. థానేతోపాటు సహాపూర్లోని మొదక్ సాగర్ డ్యాం గురువారం ఉదయం నుంచి ఓవర్ ఫ్లో అవుతోందని అధికారులు తెలిపారు. కసర్ చాట్ సెక్షన్లోని సెంట్రల్ రైల్వేకి చెందిన రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పూణే జిల్లాకు దారి తీసే రైలు పట్టాలపై వరద నీరు చేరింది. రత్నగిరి జిల్లాలో కొంకణ్ రైల్వే పలు సర్వీసులను రద్దు రద్దు చేసింది. వాటిలో పాక్షికంగా రద్దు చేయడం, దారిమళ్లి ంచడం చేసినట్టు అధికారులు తెలిపారు. వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లల్లో 6 వేల మంది ప్రయాణికులు చిక్కుకున్నట్టు చెప్పారు. ఇక దక్షిణ మధ్య రైల్వే.. కళ్యాణ్ సెక్షన్లోని కసరలో కొండచరియలు విరిగి పడిన కారణంగా హైదరాబాద్-ముంబయి, భువనేశ్వర్-ముంబయి నుంచి వచ్చి వెళ్లే రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్ళించడమో చేసినట్టు వెల్లడించింది.
ముమ్మరంగా సహాయ చర్యలు..
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. దీని కోసం ముంబయిలో 4 చోట్ల, ఇతర జిల్లాల్లో 5 చోట్ల జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను నియమించడంతో పాటు స్థానిక అధికారులు సైతం సహాయ చర్యల్లో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముంబయిలో పలు ఇండ్లలోకి వరద నీరు చేరుకోగా బాధితులను సహాయ శిబిరాలకు తరలించడానికి మరబోట్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలోని నిరాశ్రయులైన వేలాది మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
వరదలపై అత్యవసర సమావేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అత్యవరస సమావేశం ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలతో పాటు ముంబయిలో వరద పరిస్థితి, సహాయక చర్యల గురించి చర్చించినట్టు సమాచారం. కొంకణ్ ప్రాంతం, రత్నగిరి, రారుగఢ్ జిల్లాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపడంతో ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. వరదల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలనీ, విపత్తు నిర్వహణ విభాగాలకు, సంబంధిత శాఖలకు అలర్ట్ చేస్తూ... వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాలని సూచించారు.