Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయ సభల్లో వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు
- ప్రతిపక్షాల ఆందోళనలతో సభలు వాయిదా
- గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ : పార్లమెంట్లో రైతు పోరు జరిగింది. రైతులు డిమాండ్లను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. ఒకవైపు పార్లమెంట్ ఆవరణలో మహాత్మ గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టగా, మరోవైపు ఉభయ సభల్లో వెల్‌లోకి దూసుకెళ్లి సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్ గురువారం కూడా స్తంభించింది. రైతుల డిమాండ్లు నెరవేర్చాలనీ, నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు చేతబూని ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. అలాగే ఉభయసభల్లో రైతుల ఉద్యమం, పెగాసస్ వ్యవహారంపై చర్చ జరపాలని ఇచ్చిన నోటీసులను రాజ్యసభ చైర్మెన్, లోక్‌సభ స్పీకర్ తిరస్కరించారు. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన మొదలుపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు నిరసనను ఉధృతం చేశారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకొని ఎంపీలను వారించారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత సభ మళ్లీ మొదలవగా.. ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి.
వీరి నిరసన నడుమే కేంద్రం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలోనూ పరిస్థితి ఏమాత్రం మారలేదు. దీంతో సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి చైర్మెన్ పోడియాన్ని చుట్టుముట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తరువాత సభ ప్రారంభమైన ప్పటికీ.. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో కొద్ది క్షణాలకే రాజ్యసభ మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో సభ్యులు తమ ఆందోళన తీవ్రతరం చేపట్టారు. ప్రతిపక్ష సభ్యలు నడుమే పెగాసస్ వ్యవహరంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేశారు. అయితే ప్రతిపక్షాలు ఆందో ళనలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన చేప ట్టాయి.కాంగ్రెస్,శిరోమణి అకాలీ దళ్, సీపీఐ(ఎం), సీపీఐ,ఆర్జేడీ,డీఎంకే,ఎల్జేడీ పార్టీలు వేర్వేరుగా ఆం దోళన చేపట్టాయి. తొలిత కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ భట్టాచార్య, శశి థరూర్, మనీశ్ తివారీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్ చంద్రన్, ఐయూఎం ఎల్ ఎంపీ బషీర్ తదితరులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.ఎంపీలంతా ప్లకార్డులు చేబూని నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాల చేశారు.రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయా లని డిమాండ్ చేశారు. అలాగే శిరోమణి అకాలీదళ్ కూడా పార్లమెంట్ ఆవరణంలో ఆందోళన చేట్టింది.మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ తన ఎంపీలతో కలిసి ఆందోళన చేశారు. నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలని,రైతుల గోడు వినాలని డిమాండ్ చేశారు.
వెనక్కి తగ్గేది లేదు : సీపీఐ(ఎం)
పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్జేడి, డీఎంకే, ఎల్జేడీ సంయుక్తంగా ఆందోళన చేపట్టాయి. ఆయా పార్టీల ఎంపీలు ప్లకార్డులు చేబూని రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం, పిఆర్ నటరాజన్, సోమ ప్రసాద్, ఎఎం ఆరీఫ్, బికాష్ రంజన్ భట్టాచార్య, వి.శివదాసన్, జర్నాదాస్ బైద్యా, జాన్ బిట్రాస్, సీపీఐ ఎంపీలు బినరు విశ్వం, ఎం.సెల్వారాజ్, కె.సుబ్బరాయన్, ఆర్జేడి ఎంపీ మనోజ్ కుమార్ ఝా, ఎల్జేడీ ఎంపీ ఎంవి శ్రేయమ్స్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజరు చౌక్‌లో ఎంపీలతో కలిసి ఎలమారం కరీం మాట్లాడారు.మూడు చట్టాలు రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేదిలేదనీ, దీనిపై పార్లమెంట్లో తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు చట్టాలపై అవగాహన కల్పించేందుకు రైతులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతుల ఆందోళనలపై మరోసారి చర్చించేందుకు సిద్ధమని చెప్పారు. రైతులు ఆందోళన విరమించాలనికోరారు.
కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ నోటీసు
ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదన్న కేంద్రం సమాధానంపై ప్రతిపక్షాల ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చాయి. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవిన్ పవర్ ఇచ్చిన సమాధానంపై సీపీఐ ఎంపీ బినరు విశ్వం ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు.