Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల భారీ ఆంక్షలు
- మీడియాకు అనుమతి నిరాకరణ
- కిసాన్ సంసద్‌కు ఎంపీల సంఘీభావం
- కదం తొక్కిన రైతన్నలు
- మోడీ సర్కార్ మౌనం : హన్నన్ మొల్లా
న్యూఢిల్లీ : చారిత్రాత్మక కిసాన్ సంసద్ (రైతుల పార్లమెంట్) ప్రారంభమైంది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపులో భాగంగా గురువారం నాడిక్కడ స్థానిక జంతర్ మంతర్ వద్ద పోలీసుల భారీ ఆంక్షల నడుమ కిసాన్ సంసద్ జరిగింది. దేశ రాజధాని సరిహద్దుల్లో గత ఎనిమిది నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులు ఎట్టకేలకు పార్లమెంట్‌కు సమీపానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా తొలిరోజు కిసాన్ సంసద్ పూర్తి క్రమశిక్షణతో ముగిసింది. తొలుత సింఘూ సరిహద్దు నుంచి కిసాన్ సంసద్‌లో పాల్గొనేందుకు బస్సుల్లో బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే రైతు నేతలు, పోలీస్ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఇచ్చిన అనుమతి ప్రతాలను చూపించిన తరువాత రైతుల బస్సులను వెళ్ళనిచ్చారు. అయితే, మార్గమధ్యలోనూ ఢిల్లీ పోలీసులు అవాంతరాలు సష్టించారు. దీంతో జంతర్ మంతర్ రైతులు చాలా ఆలస్యంగా చేరుకున్నారు.
కిసాన్ సంసద్‌కు స్పీకర్‌గా ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, డిప్యూటీ స్పీకర్‌గా మన్జీత్ సింగ్‌ను ఎన్నుకున్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో కిసాన్ సంసద్ కొనసాగింది. తొలిత రైతు ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళులర్పిస్తూ సంతాపం తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాల్లోని రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక చట్టాలపై వివరించారు. రైతు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌కు కారణమేమిటో వివరించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు కిసాన్ సంసద్‌ను సందర్శించారు. ఎఎం ఆరీఫ్, వి.శివదాసన్ (సీపీఐ(ఎం), బినరు విశ్వం (సీపీఐ), ఈటి మహ్మద్ బషీర్, ఎంపీ అబ్దుల్ సముదాని (ఐయూఎంఎల్), ఎన్.కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), టిఎన్ ప్రతాపన్, హిబి హిడెన్, ఆంటో ఆంటోని (కాంగ్రెస్) ఎంపిలు కిసాన్ సంసద్‌కు సంఘీభావం తెలిపారు.
మోడీ సర్కార్ మౌనం : హన్నన్ మొల్లా
కిసాన్ సంసద్‌ను ప్రారంభిస్తూ స్పీకర్ హన్నన్ మొల్లా మాట్లాడారు. దేశంలో పార్లమెంట్ అన్నింటి కన్న అత్యున్నత స్థానంలో ఉంటుందని, దేశంలో ఏ చట్టమైనా పార్లమెంటే చేస్తుందని అన్నారు. దీనికి కేంద్ర మంత్రులే కీలక బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విమర్శించారు. పార్లమెంట్లో ఏ చట్టం చేయాలన్న దానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయనీ, తొలుత డ్రాఫ్ట్ తయారీ చేసి, సంబంధిత భాగస్వాములతో చర్చలు జరపాలనీ, వారి అభిప్రాయాలు తీసుకోవాలని అన్నారు. తరువాత పార్లమెంటరీ కమిటీల్లో చర్చలు జరిపి, పార్లమెంట్లో ప్రవేశపెడతారని వివరించారు. అప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చలు జరిగి, ఓటింగ్ నిర్వహించి, ఆమోదించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే రైతు చట్టాల విషయంలో ఆ ప్రక్రియలేమీ జరగలేదని స్పష్టంచేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహించిన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీలను మార్షల్స్‌తో దాడి చేయించారని గుర్తుచేశారు. పార్లమెంట్ సభ్యుల హక్కు అయిన ఓటింగ్‌ను కూడా ప్రభుత్వం నిరాకరించిందని గుర్తు చేశారు. మూడు చట్టాలను మోడీ సర్కార్ బలవంతంగా ఆమోదించుకుందని విమర్శించారు.
ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోంది
ఈ సందర్భంగా రైతు నేతలు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. మూడు చట్టాలపై తమ వాదనేమిటో రైతులు వివరించలేదనీ, కేవలం చట్టాలు రద్దు కోసమే డిమాండ్ చేస్తున్నారని కేంద్ర మంత్రులు అనడం ఖండించ తగినదని తెలిపారు. రైతుల పార్లమెంట్ ప్రొసీడింగ్స్ నుంచి మీడియాను దూరం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించడం సిగ్గు చేటనీ, దీన్ని ఎస్కేఎం ఖండిస్తుందని రైతు నేతలు పేర్కొన్నారు.
వర్షాకాల సమావేశాలయ్యేంత వరకూ ఆందోళన
'గత 8 నెలలుగా మేం ఉద్యమం సాగిస్తున్నాం. శాంతియుతంగానే నిరసన చేపడుతూ ప్రభుత్వం ముందు మా డిమాండ్లు ఉంచాం. ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు మేం ఇక్కడే ఉంటాం' అని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ఈ కార్యక్రమంలో బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ కక్కాజీ, యుధ్వీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన రైతన్నలు
'కిసాన్ సంసద్ (రైతుల పార్లమెంట్)' పేరుతో నిర్వహించే ఈ ఆందోళనకు సరిహద్దుల నుంచి 200 మంది అన్నదాతలు ఐదు బస్సుల్లో చేరుకున్నారు. పోలీసు ఎస్కార్ట్ నడుమ చేరుకున్న రైతులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. అయితే, ఈ జంతర్ మంతర్ పార్లమెంట్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఉన్న అన్ని మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. తొలి నుంచి ఢిల్లీ పోలీసులు ఓవరాక్షన్ చేస్తూ మీడియాపైనా ఆంక్షలు విధించారు. కిసాన్ సంసద్‌ను కవరు చేయకుండా మీడియాను నిరోధించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించారు. రైతుల ఆందోళన చేసే ప్రదేశానికి మీడియాను అనుమతించలేదు. భారీ స్థాయిలో బారికేడ్లు వేసి ఎక్కడివారినే అడ్డుకున్నారు.
ముళ్ల కంచె, మేకులు ఏర్పాటు
మరోవైపు సింఘూ సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. టిక్రీ, ఘాజీపూర్, షాజహన్ పూర్ సరిహద్దుల వద్ద కూడా భద్రత పెంచారు. రోడ్డు మీద మేకులు పర్చడమే కాక ముళ్ల కంచె కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్కేఎం నేతలు మాట్లాడుతూ రైతులు పార్లమెంట్ వెలుపల ఆందోళన చేపడుతున్నారనీ, తమ అంతిమ లక్ష్యం నూతన రైతు చట్టాలను రద్దు చేయడమేనిని తెలిపారు.